మహా సీఎం 26 లోగా ప్రమాణం చేయాల్సిందే !
మహారాష్ట్ర శాసనసభకు గడువు ఈ నెల 26తో ముగిసిపోతుంది.
మహారాష్ట్ర శాసనసభకు గడువు ఈ నెల 26తో ముగిసిపోతుంది. దాంతో కొత్త ప్రభుత్వం ఆ రోజు నాటికి బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. లేకపోతే రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగం అనివార్యత అలా ఉంటుంది.
అయితే మహారాష్ట్ర ఫలితాలు ఒక రోజు క్రితమే వెలువడ్డాయి. బంపర్ మెజారిటీతో ఎన్డీయే కూటమి గెలిచింది. 233 సీట్లు ఎన్డీయే ఖాతాలో పడ్డాయి. మరి ఇక ఎందుకు ఆలస్యం అని అంతా అనుకుంటున్నారు. కానీ అక్కడే చిక్కు వస్తోంది.
ఎన్డీయే కూటమిలో ముగ్గురు మొనగాళ్ళు ఉన్నారు. ఆ ముగ్గురూ ఏకంగా సీఎం పీఠం మీదనే కన్నేశారు. శివసేనని చీల్చి బీజేపీతో జట్టు కట్టి సీఎం గా రెండేళ్ళ పాటు పాలించిన ఏక్ నాథ్ షిండే మళ్ళీ తనకే చాన్స్ కావాలని చూస్తున్నారు ఆయన పార్టీకి 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం మళ్ళీ షిండే ముఖ్యమంత్రి కావడమే అని అంటున్నారు. ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకే సీఎం పదవి ఇవ్వాలని రూల్ ఏమీ లేదని షిండే శివసేన నేతలు అంటున్నారు. దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం పీఠం చాన్స్ తాము వదులుకోమని చెప్పినట్లు అయిందని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే సీఎం పదవి కోసమే సొంత బాబాయ్ రాజకీయ గురువు అయిన శరద్ పవార్ ని సైతం పక్కన పెట్టి పార్టీని చీల్చిన అజిత్ పవార్ చూస్తున్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, గతంలో ఎన్నో సార్లు అయ్యారు. ఈసారి మాత్రం సీఎం చాన్స్ వదులుకోకూడదని భావిస్తున్నారు. ఆయన పార్టీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఎం సీటు కనుక తమదే అయితే ఆయన శరద్ పవార్ వైపు ఉన్న ఆ పది మందిని ఈ వైపునకు తీసుకుని వచ్చేందుకు కూడా వెనకాడరు. అంటే అజిత్ పవార్ ఎమ్మెల్యేల బలం 51 అని లెక్కలోకి వేసుకోవచ్చు అని అంటున్నారు.
ఇక బీజేపీకి 132 సీట్లు దక్కాయి. మ్యాజిక్ ఫిగర్ కి కేవలం 13 సీట్లు మాత్రమే తక్కువ. దాంతో మాజీ సీఎం దేవేందర్ ఫడ్నవీస్ ని సీఎం చేయాలని ఆ పార్టీ నేతలు గట్టిగా భావిస్తున్నారు ఫలితాలు రాకుండానే ఫడ్నవీస్ సీఎం అని చెప్పుకుంటున్నారు. దాంతో ఇపుడు ఆయనే సీఎం అని బల్లగుద్దుతున్నారు.
దీంతో అతి పెద్ద పీట ముడి సీఎం ఎంపిక విషయంలో పడబోతోంది అని అంటున్నారు. ఈ ముగ్గురు నాయకులూ సీఎం రేసులో ఉండడంతో 2019 నాటి పరిణామాలు మళ్ళీ తలెత్తేలా ఉన్నాయని అంటున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్య రాజీ కుదర్చాలీ అంటే మహా సీఎం గా కొత్త ముఖాన్ని అనూహ్యంగా తెర మీదకు తీసుకుని వస్తారని అంటున్నారు.
ఆ విధంగా అందరికీ ఆమోదం అయ్యే కొత్త నేతని తెచ్చి పగ్గాలు అప్పగిస్తే అంతా కలసి సపోర్టు ఇస్తారని కూడా అంటున్నారు. మరి ఆ కొత్త ముఖం ఎవరు, యూపీలో ఆదిత్య నాధ్ యోగీలా మధ్యప్రదేశ్ లో కొత్త ముఖంగా వచ్చిన మోహన్ యాదవ్ లా తెర మీదకు ఎవరి పేరు అయినా రావచ్చు అంటున్నారు. అయితే ఆ కొత్త ముఖం బీజేపీ నుంచే వస్తారని అంటున్నారు. చూడాల్సి ఉంది ఏమి జరుగుతుందో.