విస్త‌ర‌ణ‌లో మోడీ మార్క్‌!

Update: 2017-09-03 06:04 GMT
ఎవ‌రూ ఊహించ‌నిరీతిలో నిర్ణ‌యాలు తీసుకోవ‌టం ప్ర‌ధాని మోడీకి.. ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితుడు బీజేపీ చీఫ్ అమిత్ షాకు అల‌వాటే. ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా వ‌దిలిపెట్ట‌కుండా జ‌నాల‌కు షాకులిచ్చే మోడీ ద్వ‌యం.. తాజాగా సొంత పార్టీ నేత‌ల‌తో పాటు.. ఎన్డీయే కూట‌మికి షాకులిచ్చార‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

తాజాగా ప్ర‌మాణం చేస్తున్న మంత్రుల ఎంపిక‌కు సంబంధించి మోడీ త‌న మార్క్‌ ను ప్ర‌ద‌ర్శించారు. కేంద్ర కేబినెట్ లాంటి పే..ద్ద ప‌ద‌విని ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో న‌లుగురు మాజీ బ్యూరోక్రాట్ల‌కు ఇవ్వ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. కేంద్ర‌మంత్రులుగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్న న‌లుగురు మాజీ బ్యూరోక్రాట్ల‌లో ఇద్ద‌రు ఇప్ప‌టికే ఎంపీలు  కాగా.. మ‌రో ఇద్ద‌రు ఎంపీలు కూడా కాదు. ఇంత‌కూ ఆ న‌లుగురు ఎవ‌రంటే.. హర్‌ దీప్‌ సింగ్‌ పూరి.. కేజే అల్ఫోన్స్.. రాజ్‌ కుమార్‌ సింగ్‌(ఆర్కే సింగ్).. సత్యపాల్‌ సింగ్ లు. వీరు కేంద్రమంత్రులుగా పగ్గాలు చేపడుతున్నారు.

ఇంత‌కాలం ప‌రిపాల‌నా విభాగంలో ప‌ని చేసి.. పాల‌న‌ను నిశితంగా ప‌రిశీలించిన ఈ న‌లుగురు ఇప్పుడు మోడీ టీంలో భాగ‌స్వామ్యం కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. తాము ఈ అవ‌కాశాన్ని ఊహించ‌లేద‌ని సంతోషాన్ని వ్య‌క్తం చేయ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం తామీ విష‌యాన్ని విని థ్రిల్‌కు గురైన‌ట్లుగా చెప్పారు.

ఇక‌.. న‌లుగురు బ్రాక్ గ్రౌండ్ చూస్తే..
 
హర్‌ దీప్‌ సింగ్‌ పూరి

+ ఇండియన్ ఫారిన్‌ సర్వీస్‌ మాజీ అధికారి. ఐఎఫ్‌ ఎస్‌ ఆఫీసర్లు 1974 బ్యాచ్‌ కు చెందిన హర్‌ దీప్‌ ఐక్యరాజ్యసమితిలో ఇండియా తరపున శాశ్వత ప్రతినిధిగా విధులు నిర్వహించారు.

+ ప్రస్తుతం రీసెర్చ్‌ అండ్ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ డెవలపింగ్ కంట్రీస్‌ థింక్‌ థాంక్‌ కు చైర్మన్‌ గా - న్యూయార్క్‌లోని అంతర్జాతీయ శాంతి సంస్థకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

+ గతంలో ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్‌ ఇండియా తరపు ప్రతినిధిగా - కౌంటర్ టెర్రరిజం కమిటీకి చైర్మన్‌ గా కూడా పని చేశారు.
 
కేజే అల్ఫోన్స్

+  ‘విధ్వంసకార అధికారి’గా ఆయనకు పేరుంది. ఢిల్లీ డెవలప్‌ మెంట్‌ అథారిటీ కమిషనర్‌ గా విధులు నిర్వహించిన సమయంలో అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపిన తీరుకు మంచి పేరు వ‌చ్చింది.

+ కేరళ కొట్టాయంలో పలు అభివృద్ధి పనులు చేసిన ట్రాక్ రికార్డు ఉంది.

+ 2006లో స‌ర్వీసుకు గుడ్ బై చెప్పేసి సీపీఐ(ఎం) మ‌ద్ద‌తుదారుడిగా కంజిరాప‌ల్లి నుంచి ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. త‌ర్వాతి కాలంలో బీజేపీలో చేరారు.

+ ఆర్ ఎస్ ఎస్ - క్రిస్టియ‌న్ గ్రూపుల మ‌ధ్య స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించిన పేరుంది.

రాజ్‌ కుమార్‌ సింగ్ అలియాస్ ఆర్కే సింగ్

+ 2011-13 లో హోం సెక్ర‌ట‌రీగా ప‌ని చేసిన ఈ 1975 ఏఎస్ బ్యాచ్ అధికారి 2014లో బీజేపీలో చేరారు. బిహార్ లోని ఆర్రా నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

+ ఆరోగ్యం - కుటుంబ సంక్షేమం - సిబ్బంది - పింఛన్లు - ప్రజా ఫిర్యాదులపై ఏర్పాటైన వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో సభ్యుడిగా పని చేశారు.

+ మొద‌ట్లో బీజేపీపై మంచి సంబంధాలు లేవ‌న్న పేరున్న ఆయ‌న ఏకంగా మోడీ స‌ర్కారులో మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

+ 1990లో స‌మ‌స్తిపూర్ జిల్లా క‌లెక్ట‌ర్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్న వేళ‌.. నాటి ముఖ్య‌మంత్రి లాలూ ఆదేశాల‌తో అయోధ్య ర‌థ‌యాత్ర‌ను అడ్డుకొని మ‌రీ అద్వానీని అరెస్ట్ చేసి సంచ‌ల‌నం సృష్టించారు.

+ 2015 బిహార్ ఎన్నిక‌ల్లో క్రిమిన‌ల్స్‌ కు సీట్లు కేటాయించ‌టంపై బాహాటంగా అసంతృప్తి వ్య‌క్తి చేసిన ట్రాక్ రికార్డు ఆయ‌న సొంతం.

సత్యపాల్‌ సింగ్‌

+ ఓ ఐపీఎస్ అధికారి త‌న‌ను తాను పెద్ద గూండా చెప్పుకోవ‌టం చూడం. కానీ.. ఇందుకు స‌త్య‌పాల్ మిన‌హాయింపు. త‌న‌ను తాను పెద్ద గూండాగా ఆయ‌న అభివ‌ర్ణించుకుంటారు.

+ మ‌హారాష్ట్ర కేడ‌ర్ కు చెందిన ఈ మాజీ ఐపీఎస్ అధికారి ఇష్రాత్ జ‌హ‌న్ ఎన్ కౌంట‌ర్ కేసును 2011లో ప్ర‌భుత్వం అప్ప‌గించింది.

+ ముక్కుసూటిత‌నంతో వ్య‌వ‌హ‌రించే ఆయ‌న‌.. త‌న తోటి అధికారుల‌తో విభేదాల కార‌ణంగా విచార‌ణ బృందం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. 2014లో బీజేపీలో చేరి యూపీలోని బాగ్ ప‌త్ నుంచి ఎంపీగా గెలుపొందారు. అజిత్ సింగ్ మీద ఆయ‌న విజ‌యం సాధించ‌టం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News