మోడీ త‌ప్పు విలువ రూ.2ల‌క్ష‌ల కోట్లు

Update: 2017-11-08 06:02 GMT
పిచ్చ భ్ర‌మ‌లు కొన్ని ఉంటాయి. ప్రాక్టిక‌ల్ గా వ‌ర్క్ వుట్ కాద‌ని ఎవ‌రైనా ఉంటే.. ప్ర‌య‌త్నం చేయ‌కుండా అలా మాట్లాడ‌తావేం? ఒక వ్య‌క్తి దేశం కోసం ప్ర‌య‌త్నిస్తుంటే.. ఆశావాహ దృక్ఫ‌ధంతో ఉండ‌టం తెలీదా?  స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత ఒక నేత సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటే.. బాస‌ట‌గా ఉండాల్సిన బాధ్య‌త లేదా? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించ‌ట‌మే కాదు.. భారీ క్లాస్ పీకునోళ్లు చాలామందే.  మోడీ పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడు త‌ప్పును త‌ప్పుగా ఎత్తి చూపించే ప్ర‌య‌త్నం చేసినోళ్ల‌లో చాలామందికి ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది.

క్యాలెండ‌ర్ లో ఏడాది కాలం క‌రిగిపోయింది. మోడీ తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంతో దేశానికి లాభం జ‌రిగిందా? న‌ష్టం వాటిల్లిందా? అన్న‌ది మ‌దింపు చేయ‌టానికి ఏడాది కాలం స‌రిపోతుంది.

ఏదో జ‌రిగిపోతుంద‌ని.. అవినీతి కూక‌టివేళ్ల‌తో పెకిలించొచ్చ‌ని.. బొక్క‌సాల్లో నింపిన న‌ల్ల‌ధ‌నం మోడీ నిర్ణ‌యం దెబ్బ‌కు మ‌టాష్ అయిపోతుంద‌ని ఫీలైన వాళ్లు.. దేశానికి ఇలాంటి స‌ర్జ‌రీ అవ‌స‌ర‌మ‌ని భావించినోళ్లు ఇప్పుడు ఏమంటున్నారు? అంటే.. పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం లాభం చేయ‌క‌పోగా.. భారీ న‌ష్టాన్ని తెచ్చి పెట్టింద‌న్న విష‌యాన్ని చెబుతున్నారు.

నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంతో ప్ర‌భుత్వ ఖ‌జానాకు ల‌క్ష‌ల కోట్ల రూపాయిల నల్ల‌ధ‌నం ఖ‌జానాకు చేరుతుంద‌ని.. దాంతో భారీ సంక్షేమ‌ప‌థ‌కాల‌కు అవ‌కాశం ఉంటుంద‌న్న ఆశ వ్య‌క్త‌మైంది. కానీ.. ఆ ఆశ తీర‌క‌పోగా.. ఊహించ‌ని షాక్ త‌గిలింది. పెద్ద‌నోట్ల ర‌ద్దు అంటూ మోడీ తీసుకున్న నిర్ణ‌యానికి యావ‌త్ జాతి చెల్లించిన మూల్యం దాదాపు రూ.2ల‌క్ష‌ల కోట్ల‌కు పైనే ఉంటుంద‌ని లెక్క చెబుతున్నారు.

అదెలా అన్న‌ది చూస్తే..  ఆర్‌ బీఐ గ‌ణాంకాల ప్ర‌కారం పెద్ద‌నోట్ల ర‌ద్దు స‌మ‌యానికి చెలామ‌ణిలో ఉన్న పెద్ద‌నోట్ల విలువ అక్ష‌రాల రూ.15.44 ల‌క్ష‌ల కోట్లు. దీనికి గాను బ్యాంకుల్లో జ‌మ అయిన పెద్ద‌నోట్ల విలువ రూ.15.28ల‌క్ష‌ల కోట్లు. అంటే.. ఖ‌జానాకు చేకూరిన లాభం రూ.16వేల కోట్లు. ఈ విష‌యాన్ని కాస్త ప‌క్క‌న పెడితే.. పెద్ద‌నోట్ల ర‌ద్దుతో ప్ర‌భుత్వం వేసుకున్న లెక్క ఏమిటంటే.. చెలామ‌ణిలో ఉన్న బ్లాక్ మ‌నీ ఆర్థిక వ్య‌వ‌స్థ నుంచి అవుట్ అవుతుంద‌ని భావించారు. లెక్క‌లు చెప్ప‌లేక త‌మ ద‌గ్గ‌ర మూలిగే న‌ల్ల‌ధ‌నాన్ని అలా వ‌దిలేస్తార‌ని భావించారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు సంద‌ర్భంగా విధించిన రూల్స్ నేప‌థ్యంలో బ్యాంకుల్లో మ‌హా అయితే రూ.13 నుంచి 14 ల‌క్ష‌ల కోట్లు మాత్ర‌మే డిపాజిట్ అవుతాయ‌ని భావించారు. కానీ.. అందుకు భిన్నంగా రూ.15.28ల‌క్ష‌ల కోట్లు డిపాజిట్ అయ్యాయి. అంటే.. వ్య‌త్యాసం రూ.16వేల కోట్లు. దీన్ని లాభం ఖాతాలో రాసుకుంటే.. నష్టం లెక్క‌లోకి వెళితే అవాక్కు అవ్వాల్సిందే.

ఎందుకంటే.. పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో కొత్త నోట్ల‌ను  చెలామ‌ణీలోకి తీసుకురావ‌టానికి ఆర్ బీఐ స్వేదం  చిందించాల్సి వ‌చ్చింది. దీనికి అయిన వ్య‌యం రూ.30వేల కోట్లు. ర‌ద్దు చేసిన పాత‌నోట్లను వెన‌క్కి తీసుకోవ‌టం... ఆ స్థానంలో కొత్త నోట్ల‌ను చెలామ‌ణీలోకి తీసుకురావ‌టం కోసం ఈ మొత్తం ఖ‌ర్చు అయ్యింది. కొత్త‌నోట్లకు త‌గ్గ‌ట్లు ఏటీఎంల‌ను రీ కాలిబ్రేష‌న్ చేయ‌టం కోసం పెట్టిన ఖ‌ర్చు రూ.10వేల కోట్లు.  కొత్త నోట్ల ప్రింటింగ్ కోసం పెట్టిన ఖ‌ర్చు రూ.7965కోట్లు. ఖ‌ర్చు పెరిగింది కాబ‌ట్టి ప్ర‌భుత్వానికి ఇచ్చే డివిడెంట్ లో ఆర్ బీఐ  పెట్టిన కోత లెక్క రూ.35,221 కోట్లు. ఇక‌.. డిజిట‌ల్ లావాదేవీల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌టం కోసం కేంద్ర‌.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు పెట్టిన ఖ‌ర్చు రూ.10వేల కోట్ల‌కు పైనే.

ఈ న‌ష్టం లెక్క‌ల‌న్నీ ఒక ఎత్తు అయితే.. పెద్ద‌నోట్ల ర‌ద్దు కార‌ణంగా జ‌రిగిన జీడీపీ న‌ష్టం రూ.1.3ల‌క్ష‌ల కోట్లు. నోట్ల ర‌ద్దుతో దేశ స్థూల జాతీయోత్ప‌త్తి గ‌ణ‌నీయంగా ప‌డిపోయింది.. వేలాది మంది ఉపాధి కోల్పోయారు. నోట్ల ర‌ద్దు త‌ర్వాత జీడీపీ 13 త్రైమాసికాల క‌నిష్ఠ స్థాయి 5.7 శాతానికి ప‌డిపోయింది.  వృద్ధిరేటు ఒక‌శాతానికి త‌గ్గ‌టం కార‌ణంగా కోల్పోయిన ఆదాయం రూ.1.30ల‌క్ష‌ల కోట్లు. వీటి వ‌ర‌కే లెక్క చూస్తే.. రూ.2ల‌క్ష‌ల కోట్లు మోడీ తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యానికి జాతి చెల్లించిన మూల్యం. పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో వంద‌ల కోట్ల ప‌ని గంట‌లు వృధా చేసుకొనిఏటీఎం సెంట‌ర్ల ద‌గ్గ‌ర నిల‌బ‌డ‌టం.. బ్యాంకుల చుట్టు తిర‌గ‌టం.. అందుకోసం ఖ‌ర్చు చేసిన పెట్రోలు.. డీజిల్‌.. వాటి కార‌ణంగా ఉత్ప‌త్తి అయిన కాలుష్యం లెక్క‌లు క‌డితే... మోడీ నిర్ణ‌యం ఎంత పెద్ద త‌ప్పో తెలుస్తోంది. ఏదో జ‌రుగుతుంద‌న్న జాతికి మోడీ  భారీ భారాన్ని మోపార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News