గుజరాత్ ఎన్నికలతో మోడీకి ముచ్చెమటలు

Update: 2017-11-01 17:22 GMT
గుజరాత్ ఎన్నికలు రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. గుజరాత్ లో భారతీయ జనతాపార్టీ తరఫున హ్యాట్రిక్ సాధించిన నరేంద్రమోడీ ఆ పార్టీకి కంచుకోటగా నిలిపారు. ఈ క్రమంలోనే నరేంద్రమోడీని గుజరాత్ భారత దేశానికి ప్రదాన మంత్రి  బాధ్యతలు అప్పగించింది. గుజరాత్ రాజకీయాల్లో పటేళ్ల వర్గం క్రమేణ బీజేపీకి దూరమయ్యే పరిస్థితి ఎదురైంది. రిజర్వేషన్లలో ప్రభుత్వం నాన్చుడు దోరణి అవలంభిస్తోందని పటేళ్ల వర్గానికి చెందిన హార్థిక్ నరేంద్రమోడీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పటేళ్లందరినీ ఒక తాటిపైకి తెచ్చి ఉద్యమించడంతో బీజేపీకి మెజారిటీ ఓట్లబ్యాంకుకు బీటలు వారాయి. గుజరాత్ కంచుకోటను కాపాడుకోడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నరేంద్రమోడీ, ఆపార్టీ వ్యూహకర్త, జాతీయ అధ్యక్షులు అమిత్ షా తాజాగా గుజరాత్ ఎన్నికలపై దృష్టి సారించారు. పటేళ్ల వర్గాన్ని బీజేపీ ఆదరించి సముచిత గౌరవం ఇస్తూ ఉందని గుర్తుచేసే విధంగా కార్యక్రమం నిర్వహించారు. సర్థార్ వల్లాభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఏక్తాదివస్ నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్థార్ వల్లాభాయ్ పటేల్ ను స్మృతికి తెచ్చారు.

గుజరాత్ లో మూడు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి పటేల్ వర్గంపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చిందనే విమర్శలు లేకపోలేదు.  ఇది ఇలా ఉండగా ఇటీవల గుజరాత్ లో పటేళ్ల వర్గాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అమిత్ షా రాజకీయ చాతుర్యంతో హార్థిక్ పటేల్ కు అత్యంత సన్నిహితుల్ని బీజేపీలో చేర్చుకునే ప్రయత్నంలో సఫలమయ్యారు.  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ముఖచిత్రంలో రంగులు మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తాడనుకుంటున్న హర్దిక్‌ పటేల్‌ ప్రధాన అనుచరులు వరుణ్ పటేల్‌, రేష్మ పటేల్‌లు బీజేపీ గూటికి చేరారు.  బీజేపీ చీఫ్ అమిత్‌ షా - గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ - డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌ తో భేటీ అనంతరం వారు బీజేపీలో చేరారు. బీజేపీ గుజరాత్‌ రాష్ట్ర అధ్యక్షుడు జీతు వగ్హని వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇది ఇలా ఉండగా... పాటీదార్ వర్గానికి గాలం వేసే ప్రయత్నంలో బీజేపీలో ఖంగుతింది. పాటీదార్ నేత నరేంద్ర పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. తనను పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ కోటి రూపాయలు ఆఫర్ చేసిందన్నారు. ఆడ్వాన్స్ గా పది లక్షలు ఇచ్చారని, ఆ డబ్బును మీడియాకు చూపించారు. బీజేపీ నేత వరుణ పటేల్ ఈ డీల్ కు మధ్యవర్తిత్వం వహించాడని తెలిపారు. అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మును తీసుకొని బీజేపీలో చేరేందుకు తాను సిద్ధంగా లేనని, తనకు ఇచ్చిన పది లక్షలను కూడా వాపస్ ఇస్తానని చెప్పారు. అయితే నరేంద్ర పటేల్ ఆరోపణలు గుజరాత్ రాజకీయాల్ని షేక్ చేస్తున్నాయి. ఆయన వాఖ్యలపై బీజేపీ నేతలు ఇప్పటి వరకు స్పందించలేదు.

పటేల్‌ వర్గీయులకు రిజర్వేషన్‌ కల్పించాలంటూ గుజరాత్‌లో పెద్దఎత్తున ఆందోళన చేపట్టి వార్తల్లోకెక్కిన హార్దిక్‌ పటేల్‌ సన్నిహితులు ఇద్దరు భాజపాలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది. ఇప్పటికే హార్దిక్‌ పటేల్‌కు టికెట్‌ ఇస్తామంటూ కాంగ్రెస్‌ ఆఫర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆఫర్‌ను హార్దిక్‌ తిరస్కరించాడు. రాజకీయాలు తన లక్ష్యం కాదని.. తాను ఎన్నికల్లో పోటీ చేయనని హార్దిక్‌ చెప్పాడు. ఈ నేపథ్యంలో అతడి అనుచరులు ఇద్దరు బిజెపిలో చేరడం ఆసక్తిని కల్గిస్తోంది.. దీనిపై హర్దిక్‌ కూడా ట్విటర్‌ ద్వారా స్పందించాడు. ‘తన కాళ్లు విరిగిపోయినా సరే.. పరుగును ఆపను. ప్రజలు నాతో ఉన్నారు. వారి కోసం నా పోరాటం సాగుతూనే ఉంటుంది.’ అని ట్వీట్‌ చేశాడు. గుజరాత్‌లో పటేల్‌ కమ్యూనిటీ శక్తిమంతమైనది. ఆ వర్గం మద్దతు ఉంటే విజయం దాదాపు ఖాయమైనట్లే అని భావిస్తారు రాజకీయ విశ్లేషకులు. అయినా గుజరాత్ లో ఈసారి తన పార్టీని గెలిపించుకోవడానికి గతంలో ఎన్నడూ లేనంతగా మోడీ చెమటోడ్చాల్సి వస్తోందని అంతా భావిస్తున్నారు.

Tags:    

Similar News