కింగ్ మేకర్ : జగన్ వైపు మోదీ చూపు...?

Update: 2022-05-28 06:30 GMT
మరో నెల దగ్గరకు వచ్చేసింది రాష్ట్రపతి ఎన్నిక. జూలై 25 నాటికి ప్రస్తుత రాష్ట్రపతి రాం నాధ్ కోవిద్ పదవీ కాలం పూర్తి అయిపోతోంది. అంటే గట్టిగా సమయం లేదు. దాంతో అధికార ఎన్డీయే, విపక్ష శిబిరాల్లో అంతా రాష్ట్రపతి ఎన్నిక గురించే చర్చించుకుంటున్నారు. ఈ మధ్య తరచూ ఢిల్లీ టూర్లు వేస్తున్న కేసీయార్ అంటున్న ఒకే ఒక మాట కొద్ది నెలలలో సంచలనం జరుగుతుంది. అంతా చూస్తారు అని. దానికి భావమేంటి అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధిని ఓడించి విపక్షాల అభ్యర్ధి నెగ్గడం అన్న మాట.

నిజానికి అది జరిగే పనేనా అంటే ఇప్పటికైతే కాదు అనే చెప్పాలి. ఎలక్ట్రోల్ కాలేజిలో బీజేపీకే ఈ రోజుకీ మద్దతు ఉంది. కేవలం నాలుగు శాతం ఓట్ల దగ్గర బీజేపీ కొంత లోటు ఎదుర్కోంటోంది. ఆ లోటు భర్తీకి ఎటూ వైసీపీ సిద్ధంగా ఉంది. దాంతో బీజేపీ తరఫున ఎవరు నిలబడినా సులువుగా గెలిచే పరిస్థితి ఉంది.

అయితే ఇక్కడ చూడాల్సింది జగన్ వైఖరి. మరి జగన్ కనుక ఫేస్ టర్నింగ్ ఇస్తే మాత్రం కేసీయార్ చెబుతున్నట్లుగా సంచలనం కాదు దేశంలోనే  రాజకీయ ప్రకంపనలే చెలరేగుతాయి. కానీ జగన్ అలా చేస్తారా. ఒక విధంగా ఈసారి జరిగే రాష్ట్రపతి ఎన్నికలకలో కింగ్ మేకర్ పాత్ర జగన్ ది అని చెప్పుకోవాలి. ఆయన‌కు ఉన్న 151 ఎమ్మెల్యేల బలంతో పాటు 22 మంది ఎంపీల బలం బీజేపీకి అతి పెద్ద అండ.

దాంతో బీజేపీ కూడా జగన్ని ఏమీ అనకుండా పువ్వులా చూసుకుంటోంది. బీజేపీకి ముందు రాష్ట్రపతి ఎన్నికల గండం పూర్తి కావాలి. అది ఆ పార్టీ ఇజ్జత్ కే సవాల్ గా ఉంటుంది. 2017 ఎన్నికల వేళ అతి సునాయాసంగా బీజేపీ రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి అభ్యర్ధులను గెలిపించుకుంది. నాడు టీయారెస్, తెలుగుదేశం సహా తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే వంటి పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి.

ఇపుడు టోటల్ సీన్ మారిపోయింది. సౌత్ లో చూస్తే కేరళలో లెఫ్ట్  సర్కార్ ఉంది, వామపక్షాలు కలలో కూడా బీజేపీకి మద్దతు ఇవ్వరు, తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది. ఆ పార్టీ నుంచి మద్దతు అన్నది అసలు ఊహించలేనేలేరు. అన్నాడీఎంకే మద్దతు ఉన్నా సభ్యులు తగ్గిపోయారు. అపోజిషన్ లోకి ఆ పార్టీ వెళ్ళిపోయింది. ఇక తెలంగాణాలో చూస్తే గతంలో కేసీయార్ మోడీకి జై కొట్టారు. అందుకే బీజేపీ అభ్యర్ధులకు ఓటేశారు. ఇపుడు ఆయనే ముందుండి ఓడగొడతామని చెబుతున్నారు.

దాంతో టీయారెస్ గులాబీ ముళ్ళు కచ్చితంగా గుచ్చుకుంటాయి. మరి ఏ విధంగా చూసినా వైసీపీ మీదనే కోటి ఆశలను బీజేపీ పెట్టుకుంది. అయితే వైసీపీకి జగన్ కి రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయని అంటున్నారు. వెంకయ్యనాయుడుని రాష్ట్రపతిగా తెస్తే మాత్రం అంగీకరించరు అని కూడా వినిపిస్తున్న మాట. అలాగే వివాదరహితులు అయిన వారిని ఎవరిని తెచ్చినా తమకు ఓకే అని చెబుతారట.

అయితే బీజేపీకి ఈసారి పూర్తిగా ఔట్ రేట్ గా సపోర్ట్ ఇవ్వడం కంటే ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టునకు సవరించిన నిధులకు ఆమోదం, విభజన హామీలకు గ్రీన్ సిగ్నల్ వంటి వాటి మీద స్పష్టమైన హామీ తీసుకుని మద్దతు ఇస్తారు అని చెబుతున్నారు. అయితే ఇక్కడ బీజేపీకి కూడా ఒక వెసులుబాటు ఉంది. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ విపక్ష కూటమిని మద్దతు ఇవ్వరు, పైగా ఆయనకు ఉన్న అవసరాల దృష్ట్యా బీజేపీక మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది అని కూడా అంచనా కడుతున్నారు.

దాంతో వారు ఎంతవరకూ వైసీపీ పెట్టే డిమాండ్లకు అంగీకరిస్తారు అన్నదే చర్చగా ఉంది. అయితే రాజకీయాల్లో ఎపుడు ఏమైనా జరగవచ్చు. అందుకే కేసీయార్ సంచలనం అంటున్నారా అన్న మాట కూడా ఉందిపుడు. మొత్తానికి జగన్ పొజిషన్ రాష్ట్రపతి ఎన్నికల వరకూ చూస్తే కింగ్ మేకర్ అన్న మాట. ఈ కీలకమైన పాత్రను ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకుంటారా లేదా అన్నదే అంతా ఆసక్తిగా చూస్తున్న విషయం.
Tags:    

Similar News