ఉమన్ చాందీకి మోడీ మాస్టర్ స్ట్రోక్

Update: 2016-04-10 11:30 GMT
ప్రధాని మోడీ తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవటానికి కేరళ ముఖ్యమంత్రికి కాస్త సమయం పట్టింది. అయితే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అవకాశాలు రావు.. మనమే కల్పించుకోవాలన్న విషయాన్ని మోడీ చేతలతో చేసి చూపిస్తే.. కేరళ రాష్ట్ర సర్కారు మోడీ దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అసలు ఎన్నికల వేళ.. రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్న వేళ.. ఊహించని రీతిలో కొల్లం దేవాలయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకోవటం 105 మంది భక్తులు మరణించగా.. 350కు పైగా భక్తులు గాయాలపాలయ్యారు.

ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకోవటంతో ప్రధాని మోడీ స్పందించారు. కేరళ సీఎంతో మాట్లాడారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా ఇవ్వటానికి తాను సిద్ధమని చెప్పుకొచ్చారు. బాధితుల్ని పరామర్శించటానికి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన కేరళలో  వాలిపోయారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉందనిపించినా.. ఇక్కడే అసలు కథంతా ఉంది. కేరళకు వచ్చిన మోడీ తన వెంట వైద్యుల బృందాన్ని వెంటపెట్టుకొచ్చారు. కాలిన గాయాలకు సంబంధించి విశేష అనుభవం ఉన్న వైద్యులంటూ తన వెంట ఆయన తీసుకొచ్చారు.

చూసేందుకు ఇదంతా మామూలుగా కనిపించినా.. అసలు లెక్క వేరే ఉందని చెప్పాలి. మిగిలిన వారి మాదిరే కేరళ ముఖ్యమంత్రి సైతం మోడీ చర్యను తప్పు పట్టలేదు. కానీ.. మోడీ కొట్టిన మాస్టర్ స్ట్రోక్ అర్థం కావటానికి ఆయనకు కొన్ని గంటలు పట్టింది. ఇంతకా మోడీ కొట్టిన మాస్టర్ స్ట్రోక్ ఏమిటంటే.. కేరళ లాంటి అభివృద్ధి చెందిన రాష్ట్రంలో కాలిన గాయాలకు చికిత్స చేసే వైద్య నిపుణులు.. ఆసుపత్రులు లేవా? అన్న ప్రశ్న సీఎంకు ఎదురైంది. ప్రధాని తన వెంట వైద్య బృందాన్ని వెంట పెట్టుకురావటం ఏమిటన్న ప్రశ్నతో కానీ ఉమెన్ చాందీకి విషయం అర్థం కాలేదు. మోడీ వ్యూహాన్ని అర్థం చేసుకున్న ఆయన.. మింగాలేక.. కక్కాలేక ఉక్కిరిబిక్కిరి అవుతూ.. తమ దగ్గర అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని.. బాధితులు కోరిన ఆసుపత్రిలో చికిత్స చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. సీఎం ఉమెన్ చాందీ ఎన్ని మాటలు చెప్పినా.. ప్రధాని మోడీ తన వెంట వైద్య బృందాన్ని తీసుకురావటం హైలెట్ గా మారి.. కేరళ ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు.. బాధితులకు అందిస్తున్న సాయం ఏమాత్రం బయటకు రాని పరిస్థితి నెలకొంది. మోడీ తనను దెబ్బేసిన వైనాన్ని గుర్తించినప్పటికి.. నోరు విప్పి మాట్లాడలేని పరిస్థితిలో కేరళ సీఎం ఉండిపోయారని చెప్పాలి.
Tags:    

Similar News