'రాజ'భోగాలకు మోదీ చెక్‌!

Update: 2015-04-13 15:28 GMT
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆరో వేలు వంటి గవర్నర్లు దేశవ్యాప్తంగా రాజభవన్‌లలో రాజభోగాలు అనుభవిస్తున్నారు. కీలక సమయాల్లో వారి అవసరాన్ని బట్టి చాలామంది వారిని మచ్చిక చేసుకోవడానికి సకల సౌకర్యాలూ కల్పిస్తున్నారు. మరికొందరు, గవర్నర్‌ పోస్టును అడ్డుపెట్టుకుని తమ సొంత ప్రయోజనాలను జుర్రుకుంటున్నారు. ఒక్కొక్క గవర్నర్‌ ఖర్చు ఏడాదికి కొన్ని కోట్లలో ఉంటోంది. నిజంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమే ఇది. అందుకే, గవర్నర్ల పర్యటనలకు చెక్‌ చెప్పింది మోదీ ప్రభుత్వం.

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌నే తీసుకుంటే, ఓసారి ఆయన తిరుమల వెళ్లారు. అక్కడ రాత్రి అయిపోయంది. వెంటనే తిరిగి రావడానికి విమానాలు లేవు. దాంతో హైదరాబాద్‌ రావడానికి తనకు ఒక హెలికాప్టర్‌ పంపాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. వాస్తవానికి, ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు మధ్య మంచి సంబంధాలు ఉంటే వెంటనే ఆయనకు హెలికాప్టర్‌ పంపేస్తారు. అయితే, అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి, గవర్నర్‌ నరసింహన్‌కు సంబంధాలు అంత బాగా లేకపోవడంతో హెలికాప్టర్‌ పంపడానికి కిరణ్‌ నిరాకరించాడు. అలాగే, నరసింహన్‌ తిరుమల వెళితే, సాధారణ పరిస్థితుల్లో ఆయనతోపాటు ఆయన భార్య, ప్రైవేటు కార్యదర్శులు, సెక్యూరిటీ తదితరులు కూడా వెళతారు. గవర్నర్‌ కదిలితే ఆయనతోపాటు ఏడెనిమిది మందికి విమాన టికెట్లు, భోజనం, వసతి తదితర ఏర్పాట్లను చూడాల్సి ఉంటోంది. ఇందుకు భారీగానే ఖర్చవుతోంది. మరికొన్ని సందర్భాల్లో అయితే గవర్నర్లు సకుటుంబ సపరివార సమేతంగా మిత్రులు, బంధువులను కూడా తీసుకెళుతున్నారు. ఆ ఖర్చులను కూడా ప్రభుత్వ ఖాతాలో రాసేస్తున్నారు. ఇలా ఒక్కో గవర్నర్‌ ఖర్చు ఏడాదికి పది కోట్లపైనే అవుతోందని సమాచారం. అదే సమయంలో, గవర్నర్‌ వ్యవస్థ నుంచి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఒరిగేది ఏమీ లేదు. కొంతమంది గవర్నర్లు అయితే ఉన్న మంచి వాతావరణాన్ని కూడా పాడు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్లకు ముకుతాడు వేయాలని మోదీ ప్రభుత్వం సంకల్పించింది.
Tags:    

Similar News