సీఎంలను కూర్చోబెట్టుకొని మోడీ ఏం చెప్పారు?

Update: 2016-07-17 04:09 GMT
పదేళ్ల తర్వాత ప్రధాని నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి సమావేశం ఢిల్లీలో జరిగిన సంగతి తెలిసిందే.  ఈ సమావేశానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రులందరితో కలిసి భేటీ అయిన సమావేశం ఇదే. అయితే.. ఈ మీటింగ్ కు కొందరు ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్.. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి లు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఈ నలుగురు మినహా మిగిలిన సీఎంలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రధాని కీలక ప్రసంగం చేశారు.

కేంద్రం.. రాష్ట్రాల మధ్యన ఉండే దూరాన్ని తగ్గించటం.. సంస్కరణల రథాన్ని ముందుకు ఉరికించటంలో నెలకొన్న ఇబ్బందులతో పాటు.. గతంతో పోలిస్తే తమ ప్రభుత్వం రాష్ట్రాలకు ఎంత పెద్ద పీట వేసిందన్న విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు మోడీ. గతంలో కేంద్రంలోని ప్రభుత్వాలు రాష్ట్రాలకు ఇచ్చిన నిధులతో పోలిస్తే.. తమ సర్కారు రాష్ట్రాలకు పెద్దపీట వేయటంతో పాటు.. సహజవనరులను అమ్మిన సమయంలో వచ్చిన ఆదాయాన్ని కూడా రాష్ట్రాలకు పంచుతున్నట్లుగా చెప్పారు. రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్న విషయాన్ని పదేపదే స్పష్టం చేసిన మోడీ.. ఈ సందర్భంగా మాజీ ప్రధాని వాజ్ పేయ్ చెప్పిన విషయాల్ని గుర్తు చేశారు.

భిన్నాభిప్రాయాలు సహజమని.. వాటిని అధిగమించేందుకు వీలుగా చర్చలు.. సంప్రదింపులు చేపట్టాలన్న సూచనను చేసిన ఆయన.. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్యలు జరిపి.. విధానాల్ని రూపొందించేందుకు.. ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు ఈ వేదికే సరైనదని చెప్పుకొచ్చారు. విద్య విషయంలో చేయాల్సింది చాలా ఉందని.. విద్యలో నాణ్యత పెరగాలని.. దాన్ని పెట్టుబడిగా చూడాలన్నారు.

రానున్న రోజుల్లో కేంద్రానికి ఇవ్వనున్న నిధుల గురించి  మోడీ ప్రస్తావించారు. సహజవనరులైన బొగ్గు గనుల వేలంతో రానున్న రోజుల్లో రూ.3.35లక్షల కోట్ల ఆదాయం రానుందని.. ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు పంచనున్నట్లు ఊరించిన మోడీ.. బ్యాంకుల్లో నిరర్థకంగా పడి ఉన్న రూ.40వేల కోట్లను రాష్ట్రాలకు పంచాలన్న ఉద్దేశంలో ఉన్నట్లు చెప్పారు. ఇదే కాదు.. కిరోసిన్ వినియోగం తగ్గుతున్నందున దాని కారణంగా మిగిలే రాయితీ మొత్తంలో 75 శాతాన్ని ఆయా రాష్ట్రాలకు సాయంగా ఇచ్చే కొత్త పథకాన్ని తీసుకొచ్చినట్లుగా చెప్పారు. 2014 – 15తో 2015-2016 ఆర్థికసంవత్సరాన్ని పోలిస్తే.. రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటా 21శాతం పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. మోడీ ప్రసంగంలో రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న ఆర్థిక సాయాన్ని పదే పదే ప్రస్తావించటం స్పష్టంగా కనిపిస్తుంది.
Tags:    

Similar News