బ్రిటన్ మీడియాకు మోడీ పంచ్ లు

Update: 2015-11-14 04:19 GMT
ప్రధాని మోడీ బ్రిటన్ పర్యటన సందర్భంగా ఆ దేశ మీడియా.. భారత ప్రధానికి సంబంధించి బారీ కవరేజ్ ఇచ్చింది. ప్రముఖంగా వ్యాసాల్ని ప్రచురించింది. అయితే.. ఈ వ్యాసాల్లో వీలైనంతవరకూ మోడీ ప్రస్థానం.. ఆయన హయాంలో విమర్శకులు తరచూ ప్రస్తావించే వివాదాల్ని ప్రముఖంగా ప్రస్తావించటం కనిపించింది.

తన పర్యటన సందర్భంగా బ్రిటన్ మీడియా.. తన మీద ఉన్న వివాదాలు.. వివాదాస్పద అంశాల్ని స్పృశించటంపై మోడీ కాస్తంత అసహనాన్ని వ్యక్తం చేశారని చెప్పాలి. ప్రవాస భారతీయులతో కిక్కిరిసన స్టేడియంలో వేలాదిమందిని ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా.. బ్రిటన్ ప్రధాని కామెరన్ సమక్షంలోనే మీడియా మీద పంచ్ లు వేశారు. వాంబ్లే స్టేడియంలో వేలాదిమంది ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించిన మోడీ ప్రసంగం సాగిన 75 నిమిషాల్లో కాసేపు మీడియా మీద చురకలు వేశారు.

భారత్ లో తాజాగా నెలకొన్న మత అసహనం.. దానిపై చోటు చేసుకుంటున్న పరిణామాల్ని ప్రస్తావిస్తూ.. బ్రిటీష్ మీడియా ప్రముఖంగా కథనాలు ప్రచురించిన నేపథ్యంలో ఆయన మీడియా తీరుపై విమర్శలు చేశారు. ఒక దేశాన్న అంచనా వేసేందుకు వార్తా పత్రికలు.. టీవీ శీర్షికలు కొలమానం కాదంటూ తనలోని అసహనాన్ని బయట పెట్టేశారు. వార్తా పత్రికల్లో కనిపించేదే భారత్ కాదని ఆయన స్పష్టం చేశారు. ‘‘125 కోట్ల మందితో కూడిన భారత్.. టీవీ తెరల్ని మించిన స్థాయిలో పెద్దదీ.. మెరుగైనది’’ అంటూ మీడియా కథనాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఇప్పటివరకూ డజన్ల కొద్దీ విదేశీ పర్యటనలు చేసినా.. ఎక్కడా కూడా మీడియా మీద చురకలు వేయని మోడీ.. తాజా బ్రిటన్ పర్యటనలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం గమనార్హం.
Tags:    

Similar News