మోడీ ఖ‌ర్చు.జ‌స్ట్ 7000 కోట్లు

Update: 2018-12-14 17:14 GMT
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ గురించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం వెలుగులోకి వ‌చ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగున్నరేళ్లు పూర్తయిన ప‌ర్వంలో కీల‌క స‌మాచారం తాజాగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. విదేశీ పర్యటనలు - పథకాల ప్రచారానికి అయిన ఖర్చు రూ.7,200 కోట్లు అని తేలింది. ఈ విష‌యాన్ని సాక్షాత్తు కేంద్ర ప్ర‌భుత్వ‌మే ప్ర‌క‌టించింది.  ప్రధాని అయిన తర్వాత మోడీ 84 విదేశీ పర్యటనలకు వెళ్లారు. ఇందుకోసం సుమారుగా 280 మిలియన్ డాలర్లు (రూ.2,000 కోట్లు) ఖర్చయ్యాయి. ఇక మోడీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పలు పథకాల ప్రచార - ప్రసార కార్యక్రమాల కోసం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 720 మిలియన్ డాలర్లు (రూ.5,200 కోట్లు) ఖర్చు చేసిందని పార్ల‌మెంటు స‌మావేశాల సాక్షిగా కేంద్ర ప్ర‌భుత్వం వివ‌రించింది.

ప్రధానమంత్రి విదేశీ పర్యటనలు గురించి విదేశాంగశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ పార్లమెంట్ లో ఒక ప్రశ్నకు జవాబు ఇచ్చారు. ప్ర‌ధాని విదేశీ యాత్రల్లో ఎక్కువ భాగం ఆయన ప్రయాణించే ఎయిరిండియా వన్ విమానం నిర్వహణ - సురక్షితమైన హాట్ లైన్ ఏర్పాటుకే ఖర్చయింది. ఇక పథకాల ప్రచారానికి అయిన ఖర్చు గురించి సమాచార ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ జవాబు ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం పథకాల ప్రచారానికి రూ.527.96 కోట్లు ఖర్చు చేసింది. ఇక గత నాలుగేళ్ల లెక్కలు చూస్తే 2014-15లో రూ.979.78 కోట్లు - 2015-16లో రూ.1,160.16 కోట్లు - 2016-17లో రూ.1,264.26 కోట్లు - 2017-18లో 1,313.57 కోట్లను పథకాల విస్తృత ప్రచారం కోసం ఖర్చు చేయడం జరిగిందని పేర్కొంది.

ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ ప్రపంచంలో దాదాపు అన్ని పెద్ద దేశాధినేతలతో సమావేశమయ్యారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ - చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ - జపాన్ ప్రధానమంత్రి షింజో అబే కూడా ఉన్నారు. వీటిలో ఎక్కువ శాతం పర్యటనలు ప్రపంచ వ్యవహారాల్లో భారత్ పలుకుబడి పెంచేందుకు - వ్యూహాత్మక ఒప్పందాలు కొనసాగేలా చూసేందుకు చేశారని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. మోడీ కొన్నిసార్లు విదేశాంగ వ్యవహారాలు చక్కదిద్దేందుకు అనధికారిక పర్యటనలు జరిపారు. వీటిలో వుహాన్ లో జిన్ పింగ్ తో అనధికారిక చర్చలు కూడా ఉన్నాయి. డోక్లాం సరిహద్దు వివాదంపై ఇరుదేశాల సైన్యాలు ముఖాముఖి తలపడేందుకు సన్నద్ధమైన సమయంలో ఈ సమావేశం జరిగింది. నవంబర్ 2016లో పెద్దనోట్ల రద్దు ప్రకటన చేసిన తర్వాత మోడీ జపాన్ పర్యటనకు వెళ్లారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిన సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News