కొత్త డిమాండ్: మోడీ స్టేడియాన్ని నిషేధించాలి

Update: 2021-02-27 06:23 GMT
ఇంగ్లండ్ తో జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ‘నరేంద్రమోడీ స్టేడియం’లో టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడం దుమారం రేపింది. ఇది చెత్త పిచ్ అని ఐదురోజుల మ్యాచ్ రెండు రోజుల్లో ముగియడం ఏంటన్న విమర్శలు ఇంగ్లండ్ ఫ్యాన్స్, ప్రముఖుల నుంచే కాదు.. భారతీయ మేధావుల నుంచి కూడా వినిపించాయి.

స్పిన్నర్లకు స్వర్గధామంగా మలిచి అస్సలు బ్యాటింగ్ కు అనుకూలంగా లేని ఈ పిచ్ పై ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ మాత్రమే కాదు.. భారత బ్యాట్స్ మెన్ కూడా తడబడ్డారు. పెవిలియన్ కు క్యూ కట్టారు.

మూడో టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన నేపథ్యంలో మొతేరా పిచ్ పై విమర్శల వర్షం కురుస్తోంది. టీమిండియా విజయంపై కొన్ని బ్రిటీష్ వార్తా సంస్థలు తమ అక్కసు వెళ్లగక్కాయి.

ఇంగ్లండ్ ఓటమికి స్పిన్ పిచ్ కారణమని.. రెండు రోజుల్లోనే టెస్టు మ్యాచ్ ముగియడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని బ్రిటీష్ మీడియా దుయ్యబట్టింది. భారత్ క్రీడాస్ఫూర్తి హద్దులు దాటుతోందని.. ఇది అసలు టెస్ట్ క్రికెట్ కాదని నిందిస్తూ పేర్కొన్నాయి.

స్వదేశంలో జరిగే సిరీస్ లో ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుందని.. కానీ ఈ పిచ్ అయిదు రోజులకు సరిపడేది కాదని బ్రిటీష్ మీడియా విమర్శలు గుప్పించింది.

12-14 నెలల పాటు నరేంద్రమోడీ స్టేడియాన్ని నిషేధించాలన్న డిమాండ్ ను ఇప్పుడు బ్రిటీష్ మీడియా, అక్కడి క్రికెటర్లు లేవనెత్తుతున్నాయి.

ఇక ఇంగ్లండ్ రోటేషన్ పేరిట కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వడం కూడా ఆ జట్టు ఓటమికి కారణమని బ్రిటీష్ మీడియా నిప్పులు చెరిగింది. కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తున్నారని ఆరోపించాయి.

మొత్తం మ్యాచ్ లో 30 వికెట్లలో 28వికెట్లు స్పిన్నర్లకే దక్కాయి. దీంతో మొతేరా లో బ్యాట్స్ మెన్ విఫలమయ్యారా? లేక స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నరేంద్ర మోడీ స్టేడియాన్ని నిషేధించాలన్న డిమాండ్ ఊపందుకుంది.
Tags:    

Similar News