మోడీ మూడేళ్ల పాలనలో మరకలు

Update: 2017-05-25 07:02 GMT
మూడేళ్ల మోడీ పాలనలో ఎన్నో మెరుపులు.. అదే సమయంలో కొన్ని మరకలు, మరికొన్ని వివాదాస్పద అంశాలూ ఉన్నాయి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచి మూడేళ్లయిన సందర్భంలో చేసిన పలు సర్వేలన్నీ మోడీ హవా ఇంకా తగ్గలేదని చెప్తున్నాయి. ఇదంతా నిజమే అయినా.. మోడీ పాలనలోని పలు వివాదాస్పద అంశాలూ వెక్కిరిస్తున్నాయి. అవేంటో చూద్దామా..

* పెద్ద నోట్ల రద్దు

నరేంద్రమోడీయే కాదు, భారతదేశ ప్రధానులు తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల్లోనే ఇదొకటిగా నిలిచిపోయింది. నల్లధన నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా తీసుకున్న ఈ నిర్ణయం అనుకున్న టార్గెట్ ను రీచ్ కాలేకపోగా ఆర్నెళ్లు దాటినా ఇప్పటికీ సాధారణ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. తిమింగళాల కోసం అని చెప్పి వేసిన ఈ గాలం నిష్కారణంగా సామాన్య జనం గొంతులకు గాయాలు చేసింది.

* ఆధార్

ఇదీ అంతే. యూపీఏ పాలనలో ప్రవేశపెట్టిన ఆధార్ ను అప్పట్లో బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ, మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి దానికి ఆధార్ ను ముడిపెట్టడం మొదలుపెట్టారు. అయితే...  ఈ క్రమంలో ప్రజల విలువైన సమాచారం బట్టబయలైపోతుండడంతో దీనిపై వివాదాలు కమ్ముకున్నాయి.

* గోరక్షణ

గోరక్షణ పేరుతో బీజేపీతో సంబంధమున్న నేతలు, పలు సంస్థలు సాగిస్తున్న దాడులు దేశంలో కల్లోలం రేపాయి.

* రోహిత్ వేముల ఆత్మహత్య

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య  బీజేపీ అనుబంధ ఏబీవీపీపై తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చింది. మోడీ ప్రభుత్వంపైనా విమర్శలు వచ్చాయి.

* బంగారు కోటు

దేశానికి ప్రధానినైనా చాయ్ వాలానే అని చెప్పుకొనే మోడీ అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇండియాకు వచ్చిన సందర్భంలో వేసుకున్న ఓ సూటు తీవ్ర దుమారం రేపింది. దానిపై బంగారు తీగలతో మోడీ అని రాసి ఉండడంతో చాయ్ వాలా ఇమేజిని దెబ్బతీసింది. ఆ తరువాతే విపక్ష నేత రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వాన్ని సూట్ బూట్ సర్కారు అనడం ప్రారంభించారు.

* ఉత్తరాఖండ్ - అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలను కూల్చడం

కాంగ్రెస్ పాలనలో ఉన్న ఉత్తరాఖండ్ లో బీజేపీ ఆడిన రాజకీయ క్రీడ తీవ్ర విమర్శలు తెచ్చిపెట్టింది. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి వేసిన కుయుక్తులు, రాష్ర్టపతి పాలన విధించడం వివాదాస్పదమయ్యాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లోనూ ఇలాంటి పరిణామాలే సంభవించాయి. రెండు చోట్లా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

* విదేశీ పర్యటనలు

మోడీ తన తొలి ఏడాది పాలనలోనే 26 దేశాలను చుట్టొచ్చారు. ఇందకు 1100 కోట్లు ఖర్చయిందని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. కెనడా, అమెరికా, జర్మనీ, సింగపూర్ వంటి దేశాలకు మోడీ వెళ్లినా ఆయా దేశాలతో ఎలాంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకోకపోవడంతో ఆయన విదేశీ పర్యటనల వల్ల ఫలితమేంటన్న ప్రశ్న మొదలైంది.

* లలిత్ మోడీతో బీజేపీ నేతల సంబంధాలు

ఆర్థిక నేరగాడు - ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీతో బీజేపీ నేతలకు ఉన్న సంబంధాలు కూడా మోడీ ప్రభుత్వంపై విమర్శలకు కారణమయ్యాయి. మోడీ కేబినెట్లోని కీలకమంత్రి సుష్మా స్వరాజ్ - రాజస్థాన్ సీఎం వసుంధర వంటివారు ఆయనకు సహకరించారన్న ఆరోపణలను కాంగ్రెస్ చేసింది.

* తమిళనాడు ఇష్యూలో

జయలలిత మరణం తరువాత తమిళనాడు రాజకీయాల్లో పైకి కనిపించకుండా బీజేపీ ఆడిన ఆటలు కూడా ఎంతో వివాదాస్పదమయ్యాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News