ప్రచారమేమో మేకిన్ ఇండియా.. వాడే కారేమో మేడిన్ జర్మనీనా?

Update: 2021-12-29 11:30 GMT
అవినీతికి దూరంగా పరిపాలిస్తున్నా.. ప్రధాని నరేంద్ర మోదీ మీద దానికిమించిన స్థాయిలో ఇతర అంశాలపై ప్రతిపక్షాలు దాడి చేస్తుంటాయి. ఓ దశలో మోదీ ధరించే చొక్కాల మీద తీవ్రంగా మండిపడ్డాయి. మోదీవి రూ.లక్షల విలువైన దుస్తులంటూ ప్రచారం సాగింది. ఇటీవల కాశీ పర్యటనలోనూ మోదీ పదేపదే దుస్తులు మార్చారంటూ విమర్శలు వచ్చాయి.

‘‘ఆకర్షణీయంగా’’కనిపించేందుకు మోదీ ఆరాటపడుతుంటారనేది రాజకీయ విశ్లేషకుల టాక్. ఇదంతా మనం అనుభవపూర్వకంగానూ చూసిందే. అయితే ఇప్పుడు మరో అంశం మరింత చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల మోదీ వాహన శ్రేణిలో కనిపించిన ఓ వాహనం గురించి చర్చంతా సాగుతోంది. మోదీ కాన్వాయ్ లోని మెర్సిడెజ్-మే బ్యాచ్ s650 మోడల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చాలామంది ఈ కారు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ కారు ధర  ఎంత ..? ప్రత్యేకతలేమిటి? అని గూగుల్ లో తెగ శోధిస్తున్నారు. వాస్తవానికి భారత్ లాంటి సువిశాల దేశానికి ప్రధాని అంటే భారీ కాన్వాయ్ తప్పనిసరి. అలా మోదీ కాన్వాయ్ లో కొన్ని ప్రత్యేక కార్లు ఉన్నాయి. ఈ జాబితాలో మరో కొత్త కారు మెర్సిడెజ్-మే బ్యాచ్ s650 చేరింది. ఈ కారు రేటు రూ.12 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.

ఏకే 47లతో పేల్చినా.. ఏమీ కాకపోవడం, భారీ బాంబు దాడులకు దిగినా అదరకపోవడం ఈ కారు ప్రత్యేకత. ఓ విధంగా చెప్పాలంటే ఇది కదిలే ‘‘రక్షణ కోట’’. ఈ మోడల్ లో బుల్లెట్ ప్రూఫ్ బయో దాడుల నుంచి రక్షణ పొందే కవచం బాంబు పేలుళ్ల నుంచి కాపాడే సదుపాయాలతో ఈ సరికొత్త కారు అందుబాటులోకి వచ్చింది. దేశ ప్రధాని కి కావాల్సిన పూర్తి భద్రతతో కూడిన వాహనానికి ఇది బాగా సరిపోతుందని నిపుణులు సలహా ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని కాన్వాయ్ లో దీనిని చేర్చినట్లు తెలుస్తోంది. ఇంజిన్ ఎప్పటికీ పేలకుండా ప్రత్యేకమైన మెటల్స్ తో దీన్ని రూపొందించారు.

కారు భద్రత స్థాయి 10 ఉంటుంది. రూ.12 కోట్ల విలువ చేసే ఈ కారులో అన్ని రకాల ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా స్టైలిష్ లుక్ లో ఇది అందరినీ ఆకర్షిస్తోంది. దీంట్లో ప్రధాని ఇటీవల ప్రయాణం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు స్వాగతం పలికేందుకు వెళ్లారు.

నినాదాలేనా? ఆచరణ లేదా? మోదీ సారూ.?

మోదీ కాన్వాయ్ కొత్త కారు.. దాని విశేషాల వ్యవహారం అంతా బాగానే ఉంది. కానీ, మోదీ ఇచ్చే నినాదాలకు ఆయన వ్యవహరించే తీరుకు లింకు కుదరడం లేదని అంటున్నారు ప్రజలు. ‘‘మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా (భారత్ లో తయారీ, భారత్ లో ఉత్పత్తి), అంటూ పదేపదే ప్రసంగంలో చెప్పే మోదీ చేస్తున్నదేమిటి? అని ప్రశ్నిస్తున్నారు.

ఇదంతా ఆయన కాన్వాయ్ కొత్త కారు మెర్సిడెజ్-మే బ్యాచ్ s650 కారణంగా తలెత్తుతున్న చర్చ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా? ఈ మెర్సిడెస్ కంపెనీ జర్మనీకి చెందినది. ఈ నేపథ్యంలోనే ‘‘భారత్ లో తయారీ’’అయిన వస్తువుల వాడకం కథేమిటి అని నిలదీస్తున్నారు. అంతేకాదు.. మోదీ ప్రధాని అయ్యాక బీఎండబ్ల్యూ 7 సిరీస్ హై సెక్యూరిటీ ఎడిషన్, రేంజ్ రోవర్ వోగ్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను వినియోగించారు. ఈ మూడు కూడా వరుసగా జర్మనీ, బ్రిటన్, జపాన్ దేశాలకు చెందినవి.

కొవిడ్ టీకాల్లోనూ మేడిన్ ఇండియా.. మేకిన్ ఇండియా.. మరి కార్లకొద్దా?

కొవిడ్ టీకాలైన భారత్ బయోటెక్ తయారీ కొవాగ్జిన్, సీరం ఇన్ స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియాగా చెబుతూ గొప్పగా ప్రచారం చేసుకుంటుంది.

హైదరాబాద్ సంస్థ అయిన భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ను ఐసీఎంఆర్ తో కలిసి తీసుకొచ్చింది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ వర్సిటీ తయారీ అయిన కొవిషీల్డ్ ను సీరం భారత్ లో ఉత్పత్తి చేస్తోంది. దీంతో వీటిని మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా టీకాలుగా ప్రధాని సైతం ఓ సందర్భంలో చెప్పకొచ్చారు. మరి అలాంటిది వాహన శ్రేణిలోని కార్లు మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియావి ఎందుకు వాడడం లేదని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

ధర 12 కోట్లు కాదట..మేడిన్ మేకిన్ ఇండియా వివాదం అలా ఉంచితే మోదీ వాహన శ్రేణిలోని కొత్త కారు ధరపైనా కొందరు నోరెళ్లబెట్టారు. సోషల్ మీడియాలో చర్చ జరగ్గా.. ఈ కారు ధర రూ.12 కోట్లు అంటూ జాతీయ మీడియాలోనూ ప్రచారం బాగా సాగింది. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. కారు ధర మీడియాలో వస్తున్నంతగా కాదని.. అందులో మూడో వంతు మాత్రమేనని చెప్పుకొచ్చాయి. రీ ప్లేస్ మెంట్ ప్రక్రియలో భాగంగానే మోదీ వాహన శ్రేణిలోని కారును మార్చినట్లు చెప్పాయి.

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ రక్షణలో ఉన్నవారి వాహనాలను ఆరేళ్లకోసారి మార్చాలని.. కానీ ప్రధాని వాహన శ్రేణిలోని వాహనాలను ఎనిమిదేళ్లుగా మార్చలేదని వివరించాయి. కొత్త వాహనంపై మోదీ లేదా ప్రధాని హోదా వ్యక్తి ఎలాంటి సూచనలు చేయరని, వారికి ఉన్న ముప్పు తీవ్రతను బట్టి ఏ కారు వాడాలనేది నిర్ణయిస్తామని స్పష్టం చేశాయి.
Tags:    

Similar News