యూపీలో మోడీ త్రీడీ ప్ర‌చారం.. మారిన క్యాంపెయిన్ సీన్‌!

Update: 2022-01-11 15:30 GMT
యూపీ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బీజేపీ పెద్ద‌లు.. ఇక్క‌డ గెలుపుగుర్రం ఎక్కేందుకు.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో భారీ ఎత్తున ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. క‌రోనా నేప‌థ్యంలో బ‌హిరంగ ప్ర‌చారాల‌కు ఎన్నిక‌ల సంఘం అడ్డు చెప్పింది. దీంతో ఇప్పుడు డిజిట‌ల్ ప్ర‌చారానికి.. పార్టీలు రెడీ అయ్యాయి. అయితే.. అన్ని పార్టీల‌కంటే ముందుగా.. బీజేపీ మ‌రింత దూకుడుగా ముందుకు అడుగులు వేస్తోంది. త్రీడీ ప్ర‌చారం ద్వారా.. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం ప్రారంభించింది.

ఉత్తర్ప్రదేశ్లో భారీ వర్చువల్ సభకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే ఈ సభకు అధునాతన సాంకేతికతతో కొత్త హంగులు అద్దుతున్నారు. వందలాది చిన్న చిన్న సభలు ఏర్పాటు చేసి.. మోడీ ప్రసంగాన్ని త్రీడీ ప్రొజెక్షన్లో లైవ్ ప్రసారం చేయనున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఉత్తర్ప్రదేశ్లో భారీ వర్చువల్ ర్యాలీ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే ఈ సమావేశానికి 50 లక్షల మంది ప్రజలు హాజరవుతారని తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత జరిగే ఈ ర్యాలీ కోసం బీజేపీ ఐటీ సెల్ నిర్విరామంగా కృషి చేస్తోంది.

బీజేపీకి బలమైన సామాజిక మాధ్యమ విభాగాలు ఉన్నాయి. భౌతిక ర్యాలీలపై జనవరి 15 వరకు నిషేధం ఉన్న నేపథ్యంలో వీలైనంత మందికి చేరువయ్యేలా ఆన్లైన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. మోడీ ప్రసంగాన్ని లక్షల మంది వీక్షించేలా పార్టీ డిజిటల్ విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం అధునాతన సాంకేతికతలను వినియోగిస్తోంది.

3డీ ప్రొజెక్షన్ సాయంతో ప్రధాని వర్చువల్ ప్రతిరూపాన్ని రూపొందించేలా కసరత్తులు చేస్తున్నట్లు బీజేపీ ఐటీ సెల్ వర్గాలు వెల్లడించాయి. 100-200 మంది హాజరయ్యే భౌతిక సమావేశాల్లో మోడీ డిజిటల్ ప్ర‌సంగాన్ని ప్రదర్శించనున్నట్లు తెలిపాయి. సభలకు హాజరైనవారికి.. మోడీ అక్కడే స్టేజీపై నుంచి ప్రసంగించినట్లు కనిపిస్తుందని పేర్కొన్నాయి. ఇలాంటి చిన్న చిన్న సభలను వందల సంఖ్యలో నిర్వహించాలని పార్టీ యోచిస్తోందని వివరించాయి.

మోడీ డిజిటల్ ర్యాలీ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 50 లక్షల మంది ఇందులో భాగస్వాములయ్యేలా మేం ప్రయత్నిస్తున్నాం. ర్యాలీ విజయవంతంగా నిర్వహించేందుకు డిజిటల్ సాంకేతికతలను ఉపయోగిస్తున్నాం. ర్యాలీకి హాజరయ్యే వారు మోడీ ప్రసంగాన్ని వినడమే కాకుండా ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని పొందుతారు. మోడీ ఢిల్లీ నుంచే ప్రసంగిస్తారు కానీ మొత్తం ఉత్తర్ప్రదేశ్ను ఉద్దేశించి మాట్లాడతారు. అని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

సంక్రాంతి తర్వాత చిన్న సమావేశాలకు ఈసీ అనుమతులు ఇస్తుందనే భావిస్తున్నామని బీజేపీ ఐటీ సెల్ వర్గాలు చెబుతున్నాయి. స్టేజీలను ఏర్పాటు చేసి తక్కువ మంది ప్రజలతో ఎన్నికల సభలు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. తద్వారా భౌతిక ర్యాలీలు ఏర్పాటు చేసిన అనుభూతి కలుగుతుందని భావిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మంది ప్రజలకు చేరువయ్యే వీలుంటుందని చెబుతున్నాయి.

మరోవైపు, రాష్ట్రంలో ఇంటింటి ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించింది. యూపీ భాజపా అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్.. లఖ్నవూలోని బల్లూ అడ్డా ప్రాంతంలో నివసించే ప్రజలను వారి ఇంటికి వెళ్లి కలిశారు. 'ఆశలు సాకారమయ్యాయి, ప్రతి ఇంటికీ అభివృద్ధి చేరుకుంది' అని రాసిన పార్టీ స్టిక్కర్లను తలుపులకు అంటించారు. ప్రజలకు తమ రిపోర్టు కార్డు అందించి, వారి నుంచి సూచనలు తీసుకుంటున్నామని స్వతంత్ర దేవ్ తెలిపారు. జన విశ్వాస్ యాత్ర ద్వారా ప్రజల ఆశిస్సులు తీసుకున్నామని చెప్పారు. మొత్తంగా చూస్తే.. యూపీలో బీజేపీ ప్ర‌చారం జోరందుకుంద‌నే వాద‌న వినిపిస్తోంది.


Tags:    

Similar News