అజహరుద్దీన్ కు పెద్ద పోస్టే ఇచ్చారబ్బా

Update: 2018-11-30 11:41 GMT
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ పై మ్యాచ్ ఫిక్సింగ్ మరకలు పడకుంటే ఈ పాటికి అతను గొప్ప స్థాయిలో ఉండేవాడేమో. క్లీన్ ఇమేజ్ తో రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఉంటే పెద్ద లీడర్ అయ్యేవాడేమో. ఫిక్సింగ్ మరకలు ఉన్నప్పటికీ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో పోటీ చేసి ఎంపీగా గెలవడం విశేషమే. కానీ తర్వాతి ఎన్నికల్లో కథ అడ్డం తిరిగింది. రాజస్థాన్ లోని టాంక్-సవాయ్ మాధోపూర్లో పోటీ చేస్తే ఓటమి తప్పలేదు. ఆ తర్వాత ఉత్తరాదిని వీడి సొంతగడ్డ హైదరాబాద్ కు వచ్చేశాడు అజహర్. ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తున్నాడు అజహర్. కానీ తన స్థాయికి తగ్గ పదవి ఇవ్వట్లేదన్న అసంతృప్తి కనిపిస్తోంది ఈ మాజీ క్రికెటర్లో.

ఐతే ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అతడిని కరుణించింది. అజహరుద్దీన్ ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం విశేషం. ఇన్ని రోజులు నాన్చి నాన్చి సరిగ్గా ఎన్నికలకు వారం రోజుల సమయం ఉండగా ఈ నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం. తెలంగాణ ఎన్నికల్లో మైనారిటీ ఓటర్లను ఆకర్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. మరి ఈ ప్రభావం ఎన్నికల్లో ఏ మేరకు ఉంటుందో చూడాలి. ఏదేమైనా అజహర్ వర్గంలో ఇప్పుడు ఉత్సాహం వచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అజహర్ వచ్చే ఐదు రోజుల్లో మరింత ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొనబోతున్నాడు. మరోవైపు బి.ఎం.వినోద్ కుమార్.. జాఫర్ జావెద్ లను పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించారు.
Tags:    

Similar News