మధుప్రియ మొగుడనుకొని చితక్కొట్టేశారే

Update: 2016-03-14 03:50 GMT
సింగర్ మధుప్రియ వైవాహిక బంధం పోలీస్ స్టేషన్ కు చేరిన సంగతి తెలిసిందే. తనను శారీరకంగా.. మానసికంగా హింసిస్తున్నారంటూ భర్త శ్రీకాంత్ మీద ఫిర్యాదు చేయటం తెలిసిందే. ఇరు వర్గాల దాడులు.. ప్రతిదాడులు.. ఆరోపణలు.. విమర్శలతో రచ్చకెక్కింది. ఇదిలా ఉంటే ఈ ఉదంతానికి సంబంధించి మరో కోణం బయటకు వచ్చింది. మధుప్రియ భర్త శ్రీకాంత్ గా భావించిన కొందరు ఒక వ్యక్తి మీద దాడి చేసిన ఉదంతం తాజాగా బయటకు వచ్చింది.

ఓపక్క భార్య..భర్తలకు పోలీసులు కౌన్సిలింగ్ చేసి.. వారి మధ్యనున్న విభేదాల్ని సమిసిపోయేలా చేస్తున్న సమయంలోనే.. ఒక వ్యక్తిని శ్రీకాంత్ గా భావించి దారుణంగా కొట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. శనివారం అర్థరాత్రి వేళ  మహ్మద్ నయిమ్ అనే వ్యక్తిని మధుప్రియ బంధువులు చితకబాదిన ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. రామాంతపూర్ లోని మ్యాట్రిక్స్ ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు.

పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రకారం.. శనివారం రాత్రి 30 ఏళ్ల మహ్మద్ నయిమ్ పై దాడి జరిగింది. ప్రైవేటు ఉద్యోగం చేసే అతనిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లుగా అతడు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధుప్రియ భర్త శ్రీకాంత్ అన్న ఉద్దేశంతో అతనిపై దాడి జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతంపై ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. భార్యభర్తల మధ్య గొడవలుంటే.. వాటిని చర్చల ద్వారా సద్దుమణిగేలా చూసుకోవాలే కానీ.. ఈ కొట్లాటలు ఏంది? ఈ తన్నటాలు ఏంది..?
Tags:    

Similar News