ఓటుకు పదివేలు అయినా రెఢీనా?

Update: 2019-10-01 06:29 GMT
తెలంగాణ రాజకీయ వర్గాల్లోనే కాదు.. సాధారణ ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారింది హుజూర్ నగర్ ఉప ఎన్నిక.  ఆ మధ్యన ఏపీలో జరిగిన నంద్యాల ఉప ఎన్నికతో దీన్ని పోలుస్తున్నారు. నాటి అధికార బాబు సర్కారుకు ప్రతిష్ఠాత్మకంగా మారిన నంద్యాల ఉప ఎన్నిక గెలుపు మాదిరే.. తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల గెలుపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనివార్యమైందంటున్నారు.

ఏదైనా తేడా కొట్టి ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ అధికార పక్షానికి ప్రతికూలంగా వస్తే.. చోటు చేసుకునే పరిణామాలు వేరుగా ఉంటాయన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ఈ ఎన్నిక విషయమై గులాబీ బాస్ మరింత అప్రమత్తంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. నామినషన్ల ప్రక్రియ ముగిసే నాటికే వందలాదిగా గులాబీ దళం హుజూరాబాద్ మొత్తాన్ని కమ్మేసినట్లు చెబుతున్నారు.

పోల్ మేనేజ్ మెంట్ లో కేసీఆర్ వ్యూహరచన తిరుగులేని రీతిలో ఉంటుందని.. అందునా.. ఈసారి అప్రమత్తత మరింత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఏ చిన్న అవకాశం ఇవ్వని రీతిలో టీఆర్ఎస్ ప్లానింగ్ ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక..ఎన్నికల్లో కీలకమైన డబ్బు పంపిణీ విషయంలో బరిలో ఉన్న రాజకీయ పార్టీలు సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఎన్నిక కోసం భారీ ఎత్తున డబ్బు పంపిణీ కార్యక్రమం ఖాయమంటున్నారు.

నోట్ల కట్టలు తెగుతాయని.. ఉప ఎన్నిక ఖర్చు.. కొత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారటం ఖాయమని చెబుతున్నారు. ఏది ఏమైనా.. డబ్బుల పంపిణీపై ఆసక్తికర అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకూ ఉన్న అంచనా ప్రకారం ఓటుకు ఐదు వేల లెక్కన ఇచ్చేందుకు గులాబీ దళం సిద్దమైందన్న మాట వినిపిస్తుంటే.. కొన్ని కీలకమైన చోట్ల పది వేల వరకూ నో ప్రాబ్లం అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే.. అంత మొత్తం ఇవ్వలేరన్న మాట పలువురు నేతలు చెబుతున్నారు.

గెలుపు కీలకమే అయినా.. ఓటుకు పదివేల చొప్పున పంపిణీ చేయటం కష్టమన్న మాట గులాబీ నేతల నోటి నుంచి వస్తోంది. ఏది ఏమైనా.. మిగిలిన ఎన్నికల ఖర్చుకు.. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఖర్చుకు పోలిక ఎంత మాత్రం ఉండదని మాత్రం తెగేసి చెబుతున్నారు. అధికారపక్షం భారీగా ఖర్చుకు సిద్ధమైన వేళ.. ఉనికి కోసం మిగిలిన రాజకీయ పార్టీలు తమ శక్తికి మించిన ఖర్చు పెట్టక తప్పదని.. అప్పుడు మాత్రమే అంతో ఇంతో మర్యాదపూర్వకంగా ఓట్లు పడే వీలుందని చెబుతున్నారు. నోట్ల కట్టలు తెగటం ఖాయమంటున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక ముగిసే నాటికి బోలెడన్ని ఆసక్తికర అంశాలు తెర మీదకు రావటం పక్కానట.
Tags:    

Similar News