లోక్ సభలో కోతుల హడావిడి !

Update: 2019-11-22 06:19 GMT
ఎవరైనా పిల్లలు గంతులు వేస్తుంటే ..ఆ కోతి గంతులేంటిరా అని పెద్దలు అనడం అందరూ చాలా సార్లు వినే ఉంటారు. ఇక కోతి చేసే చేష్టలకి కొన్ని సార్లు నవ్వొచ్చినా , కొన్ని సార్లు మాత్రం మన ప్రాణాల మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు లోక్ సభ లో ఉన్న మన ఎంపీల పరిస్థితి కూడా దాదాపు ఇదే. లోక్ సభ పరిధిలో కోతులు స్వైర విహారం చేస్తుంటే ..ఎంపీలు అవెక్కడ మీద పడతాయో అని భయం భయం తో తిరుగుతున్నారు. ఈ సమస్య పై  లోక్‌సభలో ప్రస్తావించారు  బీజేపీ ఎంపీ హేమామాలిని. బృందావనంలో  కోతుల దాడుల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీజేపీ ఎంపీకి పలువరు ఇతర ఎంపీలు కూడా మద్దతుగా నిలిచారు.

మథుర ఎంపీ హేమా మాలిని మాట్లాడుతూ.. కోతుల సమస్య  బృందావనం లో చాలా ఎక్కువగా ఉందని, నివాసాల్లోకి వెళ్లి ఆహార పదార్థాలను తింటున్నాయని చెప్పారు. కోతులతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.యాత్రికులు ఇచ్చే కచోరీ, సమోసా లాంటి పదార్థాలను తిని కోతులు అస్వస్థతకు గురవుతున్నాయని, వాటి కారణంగా అక్కడి ప్రజలు కూడా అనారోగ్యాలకు గురవుతున్నారని చెప్పారు. కోతులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అవి చాలా క్రూరంగా దాడులకు తెగబడుతున్నాయని, వృందావనంలో కోతుల దాడుల కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోయారని హేమా మాలిని చెప్పుకొచ్చారు. అలాగే  కోతులకు కూడా జీవించే హక్కు ఉంది కానీ, వాటిని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టాలని, అలాగే  కోతుల కోసం ‘మంకీ సఫారీ' ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కోతుల సమస్యను ప్రభుత్వం చిన్నది చూడవద్దని, ఇది చాలా తీవ్రమైన సమస్య అంటూ చెప్పుకొచ్చారు.

ఇక హేమ మాలిని తో పాటుగా మరికొంతమంది ఎంపీలు మాట్లాడుతూ .. ఢిల్లీలోని లూటిన్స్, గార్డెన్స్‌లో కూడా కోతుల బెడద తీవ్రంగా ఉందని, పిల్లలతో పార్కుల్లో కూర్చోవాలంటే ప్రజలు భయపడిపోతున్నారని తెలిపారు. దీనికి ప్రధాన కారణం  అడవులు తగ్గిపోవడం. ఈ కారణం చేతనే కోతులు మనుషుల నివాసాల్లోకి చొరబడుతున్నాయని, వాటికి అనుకూలమైన పరిస్థితులను కల్పించాలని ఎంపీలు అభిప్రాయపడ్డారు.

 అసలు ఈ కోతుల సమస్య ఇప్పటిది కాదు. 2014, జులైలో రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ నాటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, కోతులను తరిమేయడానికి ఎన్‌డీఎంసీ 40 మంది శిక్షణ పొందిన వ్యక్తులను నియమించిందని తెలిపారు. వాటిని తరిమేయడానికి రబ్బరు బుల్లెట్లు కూడా ఉపయోగిస్తోందని వెల్లడించారు. 2010లో కోతులను తరిమేసేందుకు శిక్షణ ఇచ్చిన కొండముచ్చులను ఉపయోగించారు.  కానీ , ఈ కోతుల సమస్య కి ఇంకా ఒక పరిష్కారం అంటూ దొరకలేదు. ఇప్పుడు కోతుల సమస్య మరింత తీవ్రతరం కావడంతో ప్రభుత్వం దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని  సభ్యులు కోరారు.
Tags:    

Similar News