మోనోశాంటోకు రూ.2వేల కోట్ల ఫైన్‌

Update: 2018-08-12 04:24 GMT
అంద‌మైన ప్ర‌చారంతో.. ఆక‌ట్టుకునేలా చెప్పే మాట‌ల‌తో ప్ర‌ముఖ కంపెనీలు చేసే దుర్మార్గాలు అన్ని ఇన్ని కావు. మా మందులు వాడండి.. మీకంతా లాభ‌మే అన్న‌ట్లుగా ప్రచారం చేసే మాట‌ల వెనుక అస‌లు గుట్టు కొన్నిసార్లు మాత్ర‌మే ర‌ట్టు అవుతుంది. అలా అయిన‌ప్పుడు.. కోర్టులు స‌ద‌రు కంపెనీల తిక్క కుదిరేలా వ్య‌వ‌హ‌రిస్తే కానీ దారికి రావు. తాజాగా అలాంటి ప‌రిస్థితే ప్ర‌ముఖ కంపెనీ మోనోశాంటోకి ఎదురైంది.

పొలాల్లో క‌లుపు మొక్క‌ల్ని నాశ‌నం చేసే గ‌డ్డిమందు కార‌ణంగా కేన్స‌ర్ వ‌స్తుంద‌న్న విష‌యం నిరూపిత‌మైంది. దీంతో.. ఆ కంపెనీపై అమెరికా కోర్టు విధించిన జ‌రిమానా ఎంతో తెలుసా?  అక్ష‌రాల రూ.2వేల కోట్లు. ఏంది?  ఒక పెద్ద కంపెనీకి అంత భారీగా ఫైన్ వేస్తారా?  సాధ్య‌మేనా? అన్న సందేహం అక్క‌ర్లేదు.

అమెరికాలోని కోర్టులు ప్ర‌జ‌ల ప్రాణాల‌కు.. ఆరోగ్యానికి హాని క‌లిగించే కంపెనీల విష‌యంలో క‌ఠినంగా ఉండ‌ట‌మే కాదు.. వారి త‌ర‌ఫున సానుకూల తీర్పులు ఇచ్చేందుకు వెనుకాడ‌వ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజా ఉదంతాన్ని చూస్తే..  రౌండ‌ప్ పేరుతో మోన్ శాంట్ కంపెనీ ఒక ర‌సాయ‌నాన్ని విడుద‌ల చేసింది. పంట పొలాల్లో క‌లుపు మొక్క‌ల్ని ఈ మందు నాశ‌నం చేస్తుంద‌ని ప్ర‌చారం చేసింది.

ఈ ప్రచారాన్నిన‌మ్మిన కాలిఫోర్నియాకు చెందిన డెవేన్ జాన్స‌న్ అనే 46 ఏళ్ల వ్య‌క్తి స్కూల్ గ్రౌండ్స్ మ్యాన్ గా ప‌ని చేసే వారు. త‌న ప‌నిలో భాగంగా మైదానంలో క‌లుపు పెర‌గ‌కుండా నిత్యం మోనోశాంటోకి చెందిన రౌండ‌ప్ మందును చ‌ల్లేవారు. ఇదిలా ఉంటే.. అత‌గాడు 2014లో లింఫోమా (అదేనండి కేన్స‌ర్) బారిన ప‌డ్డాడు.

అత‌డ్ని ప‌రీక్షించిన వైద్యులు అత‌డు కేన్స‌ర్ బారిన ప‌డ‌టానికి కార‌ణంగా త‌న ప‌నిలో భాగంగా చ‌ల్లే మోనోశాంటో మందేన‌ని తేల్చారు.  కేన్స‌ర్ బాగా ముదిరిపోవ‌టంతో.. అత‌ని ఆయుష్షు రోజుల్లోకి వ‌చ్చేసింది. తాను జీవించే అవ‌కాశాన్ని త‌న‌కు కాకుండా చేయ‌ట‌మే కాదు.. త‌న‌ను ఇంటి వ‌ద్దే ఉండేలా చేసి.. త‌న భార్య‌ను రోజుకు 14 గంట‌లు క‌ష్ట‌ప‌డాల్సి రావ‌టానికి స‌ద‌రు కంపెనీ ర‌సాయ‌న‌మే కార‌ణ‌మ‌ని వాదించాడు.

ఎప్ప‌టిలానే ఇలాంటి విమ‌ర్శ‌ల్ని.. ఆరోప‌ణ‌ల్ని కార్పొరేట్ కంపెనీ లాయ‌ర్లు త‌ప్ప‌ని చెప్పి వాదించారు. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న శాన్ ఫ్రాన్సిస్కో కోర్టు.. బాధితుడి వాద‌న స‌రైన‌దిగా తేల్చి అత‌నికి 289 మిలియ‌న్ డాల‌ర్లు.. మ‌న రూపాయిల్లో చెప్పాలంటే అక్ష‌రాల 2వేల కోట్లు ప‌రిహారం కింద ఇవ్వాల‌ని తేల్చింది. మోన్ శాంటోకి కోర్టు వేసిన మొట్టికాయ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.
Tags:    

Similar News