రానున్న రోజుల్లో మోడీకి మరిన్ని షాకులేనంట

Update: 2015-11-09 05:33 GMT
బీహార్ ఎన్నికల ఫలితం బీజేపీని వణికిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో మోడీ మేనియాతో అద్భుత విజయం సాధించిన బీజేపీకి.. రానున్న రోజులన్నీ మంచిరోజులే అని.. వరుస విజయాలతో సంబరాల మీద సంబరాలు చేసుకోవటమే మిగిలి ఉందంటూ రంగు.. రంగుల కలలు కనే వారు. అయితే.. అదేమంత సులభం కాదని బీహార్ ఎన్నికల ఫలితం స్పష్టం చేసింది. బీహార్ లో పార్టీకి బలంతో పాటు.. క్యాడర్ పుష్కలంగా ఉన్న బీహార్ లోనే ఎన్నికల ఫలితాలు ఈ తీరులో ఉంటే.. 2016లో వివిధ రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కమలనాథులకు కచ్ఛితంగా షాకులు తప్పవన్న మాట బలంగా వినిపిస్తోంది.

బీహార్ ఎన్నికల ఫలితంపై బీజేపీ అధినాయకత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. బీహార్ లో విజయంతో మోడీ మేనియా వాపు కాదని చాటి చెప్పాలనుకుంది. అందుకు భిన్నంగా భారీ ఓటమి నేపథ్యంలో భవిష్యత్తు భయంగా మారింది.

ఎందుకంటే.. 2016లో పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో బీజేపీకి పట్టు చాలా తక్కువే. అన్నీ హంగులున్న బీహార్ లోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఏ మాత్రం క్యాడర్ లేని తమిళనాడు.. కేరళ.. పశ్చిమ బెంగాల్.. అస్సాం.. పుదుచ్చేరిలలో పరిస్థితేంటన్న సందేహాలు మొదలయ్యాయి.

తమిళనాడు విషయానికి వస్తే అక్కడ డీఎంకే.. అన్నా డీఎంకేల మధ్యనే ప్రధాన పోటీ. జాతీయ పార్టీల వాసనే తమిళులకు నచ్చదు. ఒకసారి డీఎంకేకు.. మరోసారి అన్నాడీఎంకేకు మార్చి మార్చి అవకాశాన్ని ఇచ్చే తమిళులు బీజేపీ వైపు చూసే అవకాశం లేదు. దీనికి తోడు..ఆ రాష్ట్రంలో కమలనాథులకున్న బలం స్వల్పమే.

ఇక.. కేరళలో.. కాంగ్రెస్.. వామపక్షాల మధ్యనే పోరు సాగుతుంటుంది. ఈ పరిస్థితుల్లో బీజేపీకి అవకాశాలు పెద్దగా ఉండవు. ఇక.. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. అక్కడ పోటీ అంతా తృణమూల్ కాంగ్రెస్.. వామపక్షాల మధ్యనే నడుస్తుంటుంది. వారిరువురి కోట్లాటకే సరిపోయే పరిస్థితి. అలాంటప్పుడు బెంగాల్ మీద కూడా కమలనాథులు పెద్దగా ఆశలు పెట్టుకోలేని పరిస్థితి.

ఇక.. కొద్దిగో గొప్పో ఆశలు ఉన్నాయంటే అస్సాం మీదనే. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. ఆ పార్టీ అక్కడ పట్టు పెంచుకుంటుంది. ఒకవేళ అస్సాం రాష్ట్రంలో విజయం సాధించినా దాని గెలుపు దేశం మీద చూపించే ప్రభావం.. మోడీ పరిపతిని పెంచేస్తుందని భావించటం అత్యాశే అవుతుంది. ఇక.. మిగిలింది పుదుచ్చేరి. ఇక్కడ గెలుపు సాధ్యం కాదు. ఎందుకంటే.. ఇక్కడ బీజేపీ బలం నామమాత్రమే. ఈ నేపథ్యంలో 2016 కమలనాథులకు మరింత కష్టంగా ఉండటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News