ద‌ళితుల ఇళ్ల‌ గురించి మ‌హిళా మంత్రి నోరుజారారు

Update: 2018-05-04 11:47 GMT
దళితుల దృష్టిని ఆకర్షించేందుకు వారి నివాసాల్లో బస చేయాలని, భోజనం చేయాలని ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు యూపీ మంత్రులు దళితుల ఇళ్ల‌ల్లో పర్యటిస్తున్నారు. అయితే ఈ సంద‌ర్భంగా వారు  వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. సురేశ్ రానా అనే ఓ మంత్రి ఇటీవలే దళితుల ఇంటికి వెళ్లారు. అలీగఢ్‌లోని లోహగఢ్‌ లో సడెన్‌ గా ఓ దళితుడి ఇంటికి వెళ్లి భోజనం చేశారు. ఫొటోలకు పోజులిచ్చారు. ఆ తర్వాత అడ్డంగా బుక్కయ్యారు. ఆ దళితుని ఇంటికి వెళ్లక ముందే ఆ ఊళ్లో కేటరింగ్ చేసే వ్యక్తి దగ్గర అన్ని వంటకాలు వండించుకొని తీసుకెళ్లారు. తందూరీ రోటీలు - పన్నీర్ - పులావ్ - గులాబ్ జామూన్.. ఇలా అన్ని వంటకాలు తీసుకెళ్లి ఆ దళితుని ఇంట్లో కూర్చొని తిని వచ్చేశారు. ఆ వీడియోలు బయటకు రావడంతో యోగి తల పట్టుకున్నారు.

ఈ వివాదం పూర్తిగా స‌ద్దుమ‌ణ‌గ‌క‌ముందే మ‌రో మ‌హిళా మంత్రి ఇదే త‌ర‌హా ర‌చ్చ చేశారు. దళితుల ఇళ్ల‌లో దోమలు కుడుతున్నా.. భరిస్తున్నామని ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అనుపమ జైశ్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దళితులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని.. కానీ వారి నివాసాల్లో దోమలు కుడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. దోమలు కుట్టినా.. భరిస్తూనే వారి ఇళ్ల‌లో పర్యటిస్తున్నామని చెప్పారు. ఇంకో నాలుగైదు ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉందన్నారు. తాము చేస్తున్న పనిలో తనకు సంతృప్తి ఉందని యూపీ మ‌హిళా మంత్రి ముక్తాయించారు. కాగా, ఈ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్‌పీ భ‌గ్గుమ‌న్నాయి. బీజేపీ పైపై ప్రేమ‌కు ఇదే చిహ్న‌మ‌ని పేర్కొంది.

ఇప్ప‌టికే మ‌రోమంత్రి సైతం ఇదే రీతిలో వివాదంలో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే.  ఝాన్సీ  జిల్లా గధ్‌ మౌ గ్రామంలో ఓ దళితుడి ఇంటికి వెళ్లే ముందు  రాజేంద్ర ప్రతాప్ సింగ్ అనే మరో మంత్రి తానో దేవుడిని అన్న‌ట్లుగా మాట్లాడారు. `రాముడు శబరి ఇచ్చిన రేగుపళ్లను తిని ఆమెను ఆశీర్వదించినట్లే.. బీజేపీ నేతలు దళితుల ఇళ్లకు వెళ్లి వాళ్లను ఆశీర్వదిస్తున్నారు. నేనో క్షత్రియున్ని. సమాజం, మత రక్షణ కోసం పనిచేయడం నా రక్తంలోనే ఉంది. మేం వాళ్ల ఇళ్లకు వెళ్తుంటే ఈ దళితుల ముఖాల్లో ఎంత ఆనందం కనిపిస్తున్నదో చూడండి` అని అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై కూడా దుమారం రేగింది.
Tags:    

Similar News