కరోనాతో ఎంపీ కన్నుమూత..పార్లమెంట్ సమావేశాల పై స్పీకర్ మార్గదర్శకాలు

Update: 2020-08-29 07:10 GMT
మరో కొద్ది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండగా తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి సిట్టింగ్ ఎంపీ వసంతకుమార్(70) కరోనాతో మృతి చెందడం కలకలం రేపింది. కొద్ది రోజుల కిందట కరోనా  బారిన పడిన వసంత్ కుమార్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఆయన కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తొందర్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పీకర్ ఓం  బిర్లా పలు సూచనలు చేశారు. సెప్టెంబర్ 14 వ తేదీ నుంచి అక్టోబర్ 1వరకు పార్లమెంటు సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల నిర్వహణపై శుక్రవారం స్పీకర్ ఓం  బిర్లా సమీక్ష నిర్వహించారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్  గులేరియా, ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్ డాక్టర్ బలరాం భార్గవ, ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులు డీఆర్డీవో  అధికారులతో స్పీకర్ చర్చించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరిని ముట్టుకోకుండానే తనిఖీ చేసే  విధానాన్ని అందుబాటులోకి తేవాలన్నారు.  సమావేశాలకు 72 గంటలకు ముందుగానే  పార్లమెంట్ ఆవరణలోకి వచ్చే ఎంపీలు, పార్లమెంట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, మీడియా సిబ్బందికి కరోనా టెస్టులు చేయించాలని సూచించారు. సమావేశాల మధ్యలో  కూడా మరోసారి ఎంపీలు,  పార్లమెంటు సిబ్బందికి పరీక్షలు నిర్వహించాలన్నారు. ఉభయ సభలు ఒకే సమయంలో కాకుండా.. షిఫ్టులు వారీగా ఉదయం, సాయంత్రం సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ సమావేశాలను తగు జాగ్రత్తలతో నిర్వహించాలని స్పీకర్ అధికారులను ఆదేశించారు.
Tags:    

Similar News