అదిరిపోయేలా ఉన్న మ‌ల్లారెడ్డి ఆఫ‌ర్‌

Update: 2017-04-04 04:46 GMT
రాజ‌కీయాల రంగు.. రుచి.. వాస‌న పూర్తిగా మారిపోతున్నాయి. గ‌తంలో మాదిరి విలువ‌లు ఇప్పుడు లేవ‌న్న విష‌యం తెలిసిందే. గ‌తంలో రాజ‌కీయం అంటే.. ఓ మాదిరి మైండ్ సెట్ ఉన్నోళ్లు మాత్ర‌మే వ‌చ్చేవారు. కానీ.. ఇప్పుడంతా కార్పొరేట్ స్టైల్‌. వ్యాపార‌స్తులు.. పారిశ్రామిక‌వేత్త‌లు వ‌చ్చేస్తున్నారు. వ్యాపారంలో త‌మ‌కున్న అనుభ‌వాన్ని రాజ‌కీయంలోనూ అమ‌లు చేస్తున్నారు. పూర్తిస్థాయి వ్యాపారాత్మ‌కంగా రాజ‌కీయాల్ని మార్చేస్తున్నారు. ఇలాంటి వాటిని అధినేత‌లు సైతం స్వాగ‌తిస్తుండ‌టంతో ఎవ‌రికి వారు చెల‌రేగిపోతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ పార్టీకి విధేయులుగా ఉండేందుకు.. వారి అవ‌స‌రాల్ని తీర్చ‌టం.. స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించ‌టం లాంటివి చేస్తుండేవారు. అయితే.. దీనికి భిన్నంగా స‌రికొత్త ట్రెండ్ ను తీసుకొచ్చారు మ‌ల్కాజ్ గిరి ఎంపీ మ‌ల్లారెడ్డి.

విద్యాసంస్థ‌ల వ్యాపార‌వేత్త‌గా పేరు మోసిన ఆయన‌.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. కాల క్ర‌మంలో మిగిలిన తెలుగుత‌మ్ముళ్ల మాదిరే.. ఆయ‌న కూడా టీఆర్ ఎస్ తీర్థం తీసేసుకున్నారు. ప్ర‌స్తుతం అధికార‌ప‌క్షం పంచ‌న చేరిన ఆయ‌న‌.. పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ఎవ‌రూ ఊహించ‌ని డీల్‌ ను తెర మీద‌కు తీసుకొచ్చారు.

ఒక గ్రామానికి చెందిన వారంతా టోకుగా అధికార‌పార్టీలో చేరితే.. ఆ గ్రామ అభివృద్ధికి రూ.25ల‌క్ష‌లు సొంత నిధులు కేటాయిస్తాన‌ని ప్ర‌క‌టించిన మ‌ల్లారెడ్డి మాట ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ప‌లువురు టీడీపీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు.. ప్ర‌జాప్ర‌తినిధులు టీఆర్ ఎస్‌ లో చేరిన నేప‌థ్యంలో ఒక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు.. ఎంపీ మ‌ల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లు గ్రామాల‌కు చెందిన వారు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఊహించ‌ని రీతిలో భారీ ఆఫ‌ర్‌ ను ప్ర‌క‌టించారు ఎంపీ మ‌ల్లారెడ్డి. ఏదైనా గ్రామం కానీ టోకుగా టీఆర్ ఎస్ పార్టీలో కానీ చేరితే.. ఆ గ్రామ అభివృద్ధి కోసం సొంత నిధుల నుంచి రూ.25 ల‌క్షలు ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. తానీ నిధులు ఇత‌ర పార్టీల వ్య‌క్తులే లేని.. టీఆర్ ఎస్ పార్టీ నేత‌లు ఉన్న గ్రామాల‌కు మాత్ర‌మే కేటాయిస్తాన‌ని స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్హం. ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు కులాల వారీగా.. వ‌ర్గాల వారీగా కొత్త కొత్త హామీలు ఇచ్చే కేసీఆర్ కు.. ఎంపీ మ‌ల్లారెడ్డి ఆఫ‌ర్ కు ఎలా స్పందిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తానికి..  కొత్త‌త‌ర‌హా రాజ‌కీయాల‌కు నాంది ప‌లికేలా ఉన్న ఎంపీ మ‌ల్లారెడ్డి ఆఫ‌ర్‌ కు రెస్పాన్స్ ఎలా ఉంటుందో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News