వేలికి ఉంగరం పెట్టుకునే ఎంపీ మాటలు మాత్రం?

Update: 2015-09-07 04:18 GMT
లౌకికవాదుల పేరుతో నేతలు చెప్పే మాటలు అన్నిఇన్ని కావు. దేవుడి మీద నమ్మకం లేకున్నా.. హిందూ ధర్మం అంటే ఇష్టం లేకున్నా ఫర్లేదు. కానీ.. హిందూ ధర్మంలోని తప్పుల్ని ఎత్తిచూపి తిట్టేసే పెద్ద మనషులు.. మిగిలిన మతాల్ని ఉద్దేశించి పల్లెత్తు మాట అనేందుకు కూడా సాహసించరు. ఇలాంటి వారు చేసే విమర్శలు ఎంత చిత్రంగా ఉంటాయంటే.. నమ్మకాల్ని ఫాలో అవుతూనే.. అదే నమ్మకాల్ని చెత్తవన్నట్లుగా మాట్లాడేస్తుంటారు.

తాజాగా అలాంటి చిత్రమైన వాదనను వినిపించారు అమలాపురం ఎంపీ పండువల రవీంద్రబాబు. ఆదివారం ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారటంతో పాటు.. కలకలం రేపుతున్నాయి. వినాయచవితి పండుగ సందర్భంగా తొమ్మిదిరోజుల పాటు పవిత్రంగా వినాయక నవరాత్రుల్ని జరిపి.. నిమజ్జనం రోజు మాత్రం విగ్రహాల్ని కాలువల్లోకి తోసేస్తారని.. వాటి అవశేషాల్ని మాత్రం అపవిత్రంగా వదిలేస్తారంటూ వ్యాఖ్యానించారు.

మతం పేరిట బాబాలు.. మాతాజీలు మోసాలకు పాల్పడుతున్నారని.. వాళ్ల దగ్గరకు వెళ్లి మోసపోతున్నారని.. చాలామంది డబ్బులు.. క్యారెక్టర్లు కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు.

వినాయకచవితి.. బాబాలు.. స్వామీజీలతో వదిలిపెట్టని ఆయన దీపావళి బాణసంచా కాల్చటంతో ఖర్చుతో పాటు.. కాలుష్యం కూడా పెరిగిపోతుందని.. హోళీ పండగ సందర్భంగా అతిగా రంగులు పూసుకోవటంతో అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయని చెప్పుకొచ్చారు.

ఇన్ని మాటలు చెప్పిన రవీంద్ర చేతికి మాత్రం రాయి ఉన్న ఉంగరాన్ని పెట్టుకోవటం.. దాన్ని ప్రశ్నించిన మీడియాతో చేతికి ఉన్న ఉంగరాన్ని టేబుల్ మీద పడేసిన ఆయన.. ఇకపై తాను దాన్ని ధరించనని చెప్పుకొచ్చారు. తన భార్య అందంగా ఉందని చెప్పటంతోనే తాను ఆ ఉంగరాన్ని పెట్టుకున్నట్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఒకవేళ ఎంపీగారికి మతంలో ఇన్ని లోపాలు కనిపిస్తే.. మిగిలిన మతాల గురించి ఒక్కమాట మాట్లాడకపోవటం గమనార్హం. తప్పులన్నీ పోత పోసినట్లుగా హిందూ పండుగల గురించి మాత్రమే చెబుతున్న ఆయన.. మరో విధానాన్ని తప్పు పట్టారు. ఇస్రో ప్రయోగాల సందర్భంగా తిరుపతికి వెళ్లాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.

ఎంపీ చెప్పినట్లుగా ఇవన్నీ నిజమే అనుకుంటే.. పెద్ద పెద్ద సభలు పెట్టి కళ్లు లేని వారికి కళ్లు.. కాళ్లు లేని వారికి కాళ్లు.. నయం కాని జబ్బులన్నింటిని తమ మాటలతో బాగు చేసేస్తామని చెప్పే వారి గురించి ఎందుకు ప్రస్తావించరు..? అదొక్కటేనా.. చేసిన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే డబ్బు ఇచ్చేస్తే సరిపోతుందని చెప్పే మతాధికారుల గురించి మాట్లాడరేం? హోలీ రోజు చల్లుకునే రంగుల వల్ల అనారోగ్యం.. దీపావళి బాణసంచా కారణంగా కాలుష్యం గురించి వేదన చెందుతున్న ఆయన.. పరిశ్రమల కాలుష్యం గురించి ఎంతమేర పోరాడారు? అసలు ఎప్పుడైనా మాట్లాడారా? అంతదాకా ఎందుకు? ఒక కేజీ మాంసం తయారీకి దాదాపు పది కేజీల గడ్డి (పచ్చదనం) అవసరం అవుతుంది. ప్రపంచంలో కాలుష్యానికి కారణమైన అతి ముఖ్యమైన అంశాల్లో మాంసం భుజించటం.. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? మాంసాహారానికి వ్యతిరేకంగా ఎందుకు గళం విప్పటం లేదు?

 ఒక మతాన్ని అభిమానించకపోవటం తప్పేం కాదు. కానీ.. మనసులో అది పెట్టుకొని.. ఆ విషయాన్ని చెప్పకుండా.. ఆ మతంలో ఎన్ని లోపాలు ఉన్నాయో అన్నట్లుగా చిట్టా చదివేయటంలోనే అసలు అభ్యంతరమంతా. ఒకరు చేసేదంతా తప్పు అన్నట్లుగా మాట్లాడే కన్నా.. అందులోని మర్మాన్ని గుర్తిస్తే బాగుండేది. ఇలాంటి వాదనలు పెద్ద ఎత్తున ప్రజల మనోభావాలు దెబ్బ తింటాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎంపీగా ఉన్న వ్యక్తి చేసే వ్యాఖ్యలు కొందరి మనసును గాయపరిచేలా ఉండటం అభ్యంతరకరమే కాదు.. అన్యాయం కూడా. మరి..ఈ విషయాన్ని రవీంద్రకు బిగ్ బాస్ అయిన చంద్రబాబు చెబితే బాగుంటుంది.
Tags:    

Similar News