బీజేపీని దుమ్ము దులిపిన బీజేపీ ఎంపీ

Update: 2021-03-06 09:30 GMT
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక రాజ్యాంగం రాసుకుంది. అదేంటయ్యా అంటే ‘75 ఏళ్ల దాటిన నాయకులకు పార్టీ పదవులు ఇవ్వకూడదని..’ సరే యువతకు అవకాశం ఇస్తున్నారని తెలిసి చాలా మంది సపోర్టు చేశారు. అయితే అది కేవలం సీనియర్లను పక్కకు తప్పించి మోడీషాల ఆధిపత్యంలోకి తీసుకురావడానికేనన్న విమర్శలు వచ్చినా ఇన్నాళ్లు ఎవరూ దీనిపై నోరు మెదపలేరు.

మోడీషాలు వచ్చాక సీనియర్లు అయిన అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్ , శాంతకుమార్, ఉమాభారతి, మేనకాగాంధీ సహా చాలా మందిని పక్కనపెట్టారు. ఇక పోటీగా భావించిన వెంకయ్యనాయుడు లాంటి నేతల ఉపరాష్ట్రపతిని చేసి ఉత్సవవిగ్రహంగా మార్చారన్న ఆరోపణలు వినిపించాయి. అయినా మోడీషాలు వెనక్కి తగ్గకుండా దీన్ని దిగ్విజయంగా అమలు చేసి బీజేపీ సీనియర్లను సాంగనంపారన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగింది.

అయితే పగవారికి ఆ రాజ్యాంగం వర్తింపచేస్తూ తమ వారికి వచ్చేసరికి ఆ రాజ్యాంగాన్ని అమలు చేయరా? అన్న విమర్శలు ఇప్పుడు బీజేపీ అగ్రనేతల నుంచే వినిపిస్తుండడం విశేషంగా చెప్పొచ్చు. మోడీషాలు రాసుకున్న రాజ్యాంగం ఇప్పుడు ఎందుకు ఉల్లంఘిస్తున్నారని స్వయంగా బీజేపీ సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి బాంబు పేల్చారు.

తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ ‘కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ పేరు ప్రకటించడాన్ని’ తప్పుపట్టారు. ‘శ్రీధరన్ వయసు 89 ఏళ్లు. బీజేపీ రూల్స్ ప్రకారం 75 ఏళ్లు దాటిన వారికి పార్టీ పదవులు ఇవ్వరు. మరి ఇది సరైన నిర్ణయమా? అని సుబ్రహ్మణ్యస్వామి ప్రశ్నించారు.

ఇక వేళ బీజేపీ నిర్ణయం కరెక్ట్ అయితే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శాంతకుమార్ లు 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయాలి అని స్వామి ట్వీట్ చేసి బీజేపీ పెద్దల తీరును దుమ్ముదులిపాడు.
Tags:    

Similar News