మ‌న దేశం గ‌ర్వించే మ‌నిషి నోట‌...పొలిటీషీయ‌న్ల నిజ స్వ‌రూపం

Update: 2018-12-24 06:16 GMT
ఎంఎస్ స్వామినాథన్...భారత హరిత విప్లవ పితామహుడు. దేశం నేడు ధాన్యం నిల్వ‌ల‌తో సుభిక్షంగా ఉండ‌టంలో ఆయ‌న కృషి ఎంతో. అలాంటి వ్య‌క్తి తాజాగా మీడియా ముందు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసం రాజకీయ పార్టీలు రుణమాఫీ మంత్రాన్ని జపిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చిన సమయంలోనే రైతులు - రైతు సమస్యలు - రుణమాఫీ .. ఆయా పార్టీలకు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాల్ని రద్దు చేస్తామంటూ నేతలు చేస్తున్న ప్రకటనలపై ఆయన ఘాటుగా స్పందించారు. రుణమాఫీ చిట్కా ఆర్థికంగా ఆచరణ సాధ్యం కాదని చెప్పారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం - ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రుణమాఫీని ఆయుధంగా ఉపయోగించుకోవద్దని నేతలకు హితవు పలికారు.

ఇటీవల మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - ఛత్తీస్‌ గఢ్‌ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతుల రుణాలను మాఫీ చేయడం - వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ రుణమాఫీ చేస్తామని ప్రకటించడంపై స్వామినాథన్ ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ``వ్యవసాయ సంక్షోభం అనేది ఆర్థికపరమైన సమస్య. చిన్న రైతులు నిలదొక్కుకోవాలంటే వర్షాలు, మార్కెట్ అత్యంత ప్రధానమైనవి. ఎన్నికల్లో లబ్ధి కోసం రాజకీయ నేతలు ఆర్థికంగా ఆచరణ సాధ్యంకాని హామీలను ప్రోత్సహించకూడదు`` అని పేర్కొన్నారు. రైతుల రుణాల రద్దు వ్యవసాయ విధానంలో భాగం కాకూడదని స్వామినాథన్ చెప్పారు. రైతులు తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యంలేని - సంక్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే సందర్భాన్ని బట్టి రుణాల్ని రద్దు చేయాలని సూచించారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా చేయడానికే వ్యవసాయ విధానంలో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

రాజ‌కీయ నాయ‌కుల విధానం గురించి ఆయ‌న తీవ్రంగా స్పందించారు. ఎన్నికలు వచ్చినప్పుడే రైతుల సమస్యలు గుర్తుకు వచ్చే విధానం వ్యవసాయ రంగానికి తీవ్ర హాని చేస్తుందని చెప్పారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వాలకు స్పష్టమైన ప్రణాళిక ఉంటేనే కనీస మద్దతు ధర సమర్థంగా అమలవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు ఇబ్బందులు ఉండవు. అలాగే ధాన్యం సేకరణ - ధరల విధానం - ప్రజా పంపిణీ విధానంపై ప్రభుత్వాలు అంతర్గతంగా ఒక పాలసీని అమలు చేయాలి. కనీస మద్దతు ధర, ధాన్యం సేకరణ ఆచరణలో సాధ్యం కాకపోతే వ్యవసాయ రంగంలో సంక్షోభం తప్పదు. వ్యవసాయం అనేది రైతులకు ఆర్థికంగా లాభసాటిగా ఉండాలి. రైతుల ఆర్థిక స్థితిగతుల్ని మార్చేలా ప్రభుత్వ విధానాలు ఉండాలి. వ్యవసాయం అనేది ఆకర్షణీయమైన ఉద్యోగంగా మారి నేటి యువతను ఆకర్షించినప్పుడే ఈ రంగంలో పురోభివృద్ధి సాధ్యమవుతుంది అని స్వామినాథన్ పేర్కొన్నారు.
Tags:    

Similar News