రాయక రాయక జగన్ కి ముద్రగడ ఒక లేఖ...?

Update: 2021-12-20 09:36 GMT
ముఖ్యమంత్రికి రాజకీయ నాయకులు లేఖలు రాయడం సహజం. చంద్రబాబు జగన్ సీఎం అయిన కొత్తల్లో జోరు మీద‌ చాలా లేఖలే సంధించేవారు. అయితే వేటికీ  జగ‌న్ వైపున సరైన  రెస్పాన్స్ లేదని భావించారో ఏమో తెలియదు కానీ జగన్ కి లెటర్స్ రాయడమే  పూర్తిగా  మానుకున్నారు. ఆయన ఇపుడు అనేక సమస్యల మీద  ఎక్కువగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి లేఖలు రాస్తున్నారు. ప్రభుత్వం అంటే వారిద్దరే అని బాబు భావిస్తున్నట్లుగా  తెలుస్తోంది.

ఇక బీజేపీ నేతలు కూడా జగన్ కి లేఖలు రాస్తూంటారు. అలాగే సీపీఐ నుంచి రామక్రిష్ణ కనీసం నెలకు ఒక లేఖ అయినా జగన్ కి రాస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్  నుంచి జగన్ కి లేఖలను ఆశించలేరు అంటారు. కాంగ్రెస్ పార్టీ అయితే  సరేసరి. మొత్తానికి చూసుకుంటే జగన్ రెండున్నరేళ్లే పాలనలో లేఖలు రాసేవారు కూడా బాగా  తగ్గిపోయారు అనే చెప్పాలి.

తమ లేఖలకు మంచో చెడ్డో రెస్పాన్స్ వస్తే మళ్లీ రాయడానికి ఉత్సాహం ఉంటుంది అన్నది వారి భావన కావచ్చు. ఇదిలా ఉంటే జగన్ కి రాయక రాయక ఒక లేఖ ముద్రగడ పద్మనాభం  రాశారు. ఆయన ఇంతకు  ముందు అంటే  జగన్ సీఎం అయిన  కొత్తల్లో ఒకటి రెండు లేఖలు రాసినట్లు గుర్తు.  అయితే జగన్ కి ఇబ్బంది కలిగించే పొలిటికల్  స్టేట్మెంట్స్ ఎపుడూ ముద్రగడ పద్మనాభం వైపు  నుంచి ఉండవని అంటారు.

ఆయన కోపం ఈ రోజుకీ కూడా టీడీపీ అధినేత  చంద్రబాబు మీదనే ఎక్కువగా ఉందని కూడా చెబుతారు. ఇక ముద్రగడ జగన్ కి రాసే లేఖలు కూడా డిమాండ్ గా ఉండవు,  కొండమీద కోతికి తెప్పించాలని కోరేలా అసలు ఉండవు. లేటెస్ట్ గా ఆయన జగన్ కి రాసిన లేఖలో కూడా స్మూత్ గానే ఒక ఇష్యూని సెటిల్ చేయమని రాశారు.

సంక్రాంతి పండుగ అంటే గోదావరి జిల్లాలల్లో కోడి పందేలకు పెట్టింది పేరు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాటికి అనుమతిస్తూనే ఉంటుంది. అయితే జగన్ సర్కార్ ఈ విషయంలో కొంత బెట్టుగానే ఉంటోంది. కానీ లోపాయికారిగా జరగాల్సిన పందేలు అలా జరిగిపోవడమే విశేషం. అయితే ఇక్కడ అనవసరంగా పోలీస్ కేసులు పెడుతూ ప్రజలను  ఇబ్బంది పాలు చేస్తున్నారు అన్న విమర్శలు అయితే ఉన్నాయి.

ఈసారి అలాంటివి ఏవీ జరగకుండా అంతా హ్యాపీగా కోడి పందేలను తమ ఊళ్ళలో ఎంజాయ్ చేసేలా ఒక అయిదు  రోజుల పాటు పర్మిషన్ ఇస్తూ జగన్ సర్కార్  ఆర్డినెన్స్ తీసుకురావాలని ముద్రగడ లేఖలో  కోరారు. కోడి పందేలు జల్లి కట్టు వంటి వాటి కంటే ప్రమాదకరం కానే కావని కూడా ముద్రగడ పేర్కొనడం విశేషం. అంతే కాదు, కోడి పందేలు, ఎడ్ల  పందేలు, జాతరలు గ్రామీణంలో ఉన్న సంక్రాంతి ఆచారాలుగా ఆయన పేర్కొన్నారు. పండుగ పూట ప్రజలు జైళ్లకు వెళ్ళే పరిస్థితి రాకుండా చూడాలని ఆ లేఖలో ముద్రగడ కోరడం గమనార్హం.  మొత్తానికి ముద్రగడ సాఫ్ట్ గా లేఖ రాశారు. మరి జగన్ దాన్ని ఎలా పరిశీలిస్తారో, మరెలా రెస్పాండ్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News