కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరోమారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపుల రిజర్వేషన్ల విషయంలో అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తన గళం విప్పారు. ఈ దఫా ఏకంగా నాలుగు అంచెల ఉద్యమాన్ని ప్రకటించారు. ఏపీలోని 13 జిల్లాల కాపు జేఏసీ నేతలతో సమావేశమయిన ముద్రగడ పద్మనాభం కాపుల సంక్షేమ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే విషయమై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాపుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే తాము కోరుతున్నాం తప్ప గొంతెమ్మ కోరికలు కాదని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తమపై కులం ముద్ర వేయడం - ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పాలకుల కళ్లు తెరిపించేందుకు నాలుగు దఫాలుగా ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు.
తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఈనెల 18న నల్లరిబ్బన్లు - కంచం - గరిటతో ఆందోళన చేయనున్నమని ముద్రగడ ప్రకటించారు. ఈనెల 30న ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు సమర్పించడం, జనవరి 9న కొవ్వొత్తుల ప్రదర్శన, జనవరి 25న రావులపాలెం నుంచి అంతర్వేది వరకు పాదయాత్ర కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ముద్రగడ పద్మనాభం తెలిపారు. పాదయాత్రకు పోలీసు అనుమతి తీసుకునే ప్రసక్తే లేదన్నారు.తమ ఆందోళనను అణిచివేయాలని ప్రభుత్వం భావిస్తే కాపు సోదరులు ఆగ్రహానికి గురికాక తప్పదని ముద్రగడ హెచ్చరించారు. ఇప్పటికే ప్రభుత్వానికి తమ హామీలు నెరవేర్చేందుకు సరిపడా సమయం ఇచ్చామని, కానీ హామీలను నిలుపుకోలేక పోవడం పైగా పక్కకు పోవడంతో ఉద్యమ కార్యాచరణను చేపట్టినట్లు ముద్రగడ స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/