కాపు ఉద్యమ కర్త , కర్మ, క్రియ అరెస్టు

Update: 2016-06-07 09:27 GMT
అమలాపురం పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన కాపు ఉద్యమ నేత - మాజీమంత్రి ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అక్కడ నుంచి రాజమండ్రి సీబీఐ కార్యాలయానికి తరలించారు. దీంతో కాపు కార్యకర్తలు - నేతలు ఆందోళనకు దిగారు. ముద్రగడను తరలిస్తున్న బస్సుకు అడ్డుగా బైఠాయించడం కాసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.  ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో పాటు కొందరు ఆందోళనకారులు ముద్రగడను తీసుకువెళుతున్న వాహనంపై రాళ్లు రువ్వారు.  దీంతో పరిస్థితి అదుపు తప్పుతోందని గుర్తించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.

కాగా తుని ఘటనలో అరెస్ట్ అయినవారిని వదిలిపెట్టాలంటూ ముద్రగడ పద్మనాభం ఈరోజు ఉదయం అమలాపురం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో అమలాపురంలో క్షణక్షణానికీ ఉద్రిక్తత పెరుగుతోంది. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన పోలీసులు  ముద్రగడ పద్మనాభాన్ని రాజమండ్రిలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో ఆగ్రహావేశాలకు గురైన కాపులు ముద్రగడను ఎక్కించిన పోలీస్ వ్యాన్ పై రాళ్ల దాడితో విరుచుకుపడడంతో వారిని చెదరగొట్టి  అమలాపురంలో పోలీస్ చట్టం-30 ప్రకారం ఆంక్షలను విధించారు.

అంతకుముందు  కాపు గర్జన సమయంలో తునిలో జరిగిన విధ్వంసానికి సంబంధించి పోలీసులు పది మందిని అరెస్టు చేయడంతో ముద్రగడ ధర్నాకు దిగారు.  అరెస్ట్ చేసినవారిని ఎక్కడికి తీసుకువెళ్లారో చెప్పాలని.. ఉద్యమానికి కర్త - కర్మ - క్రియ తానే కాబట్టి తొలుత తనను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. దాంతో పోలీసులు ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చే క్రమంలో ఆయన్ను అరెస్టు చేశారు. అయితే.. నేరస్థులను తీసుకెళ్లే వ్యానులో ముద్రగడను తీసుకెళ్లడం వివాదానికి దారి తీస్తోంది.
Tags:    

Similar News