పిఠాపురం మీద కన్నేశారా ?

Update: 2023-05-11 15:23 GMT
రాబోయే ఎన్నికల్లో కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుండి పోటీచేయటానికి ముద్రగడ పద్మనాభం కన్నేశారా ? అవుననే సమాధానం వినిపిస్తోంది కాపు సమాజికవర్గంలో. ఇప్పటికి మూడుసార్లు ఎంఎల్ఏగా రెండుసార్లు మంత్రిగా ఒకసారి ఎంపీగా పనిచేసిన ముద్రగడకు పిఠాపురం కొత్తేమీకాదు. కాకపోతే చాలాకాలం తర్వాత ముద్రగడ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. రీ ఎంట్రీ ఏ పార్టీ నుండి అంటే వైసీపీ నుండి జరిగేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

చంద్రబాబునాయుడుతో పడని కారణంగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం దాదాపు లేదనేచెప్పాలి. కాపు రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం ముద్రగడతోనే కాదు ఆయన కుటుంబాన్ని కూడా బాగా అవమానించింది.

దాంతో చంద్రబాబు అంటేనే ముద్రగడ మండిపోతున్నారు. ఇక జనసేన విషయం చూస్తే ఇందులో చేరే అవకాశాలు కూడా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ముద్రగడకు మధ్య ఇగే సమస్యలున్నాయి.

కాపు ఉద్యమంలో తనతో పాటు తన కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బందులు పెట్టినపుడు పవన్ ఒక్కసారి కూడా తప్పని చెప్పలేదు . ఆ మంట ముద్రగడలో బాగా ఉందని సమాచారం. అలాగే పార్టీలో రెండో పవర్ సెంటర్ ను పవన్ ఇష్టపడరు.

అందుకనే ప్రముఖులెవరినీ పార్టీలోకి ఇంతవరకు చేర్చుకోలేదు. ముద్రగడను గనుక పవన్ చేర్చుకుంటే రాజకీయం మొత్తం ముద్రగడ చుట్టూనే తిరుగుతంది. అందుకనే ముద్రగడను పవన్ ఎంటర్ టైన్ చేసే అవకాశాలు తక్కువనే చెప్పాలి.

ఇక మిగిలింది వైసీపీ మాత్రమే. ముద్రగడ కష్టాల్లో ఉన్నపుడు వైసీపీ నేతలు మద్దతుగా నిలిచారు. అందుకనే ముద్రగడ వైసీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ముద్రగడతో సమస్య ఏమిటంటే ప్రతిచిన్న విషయానికి అలుగుతారు. తాను ఎక్కడున్నా తనకే ప్రాధాన్యత దక్కాలని కోరుకుంటారు. లేకపోతే వెంటనే గోల మొదలుపెట్టేస్తారు. ఒకవిధంగా ముద్రగడ ఎవరితోను ఎక్కువకాలం ఇమడలేరు. ఇమడలేకపోవటం, స్ధిరం లేకపోవటమే ముద్రగడకు పెద్ద మైనస్ గా మారింది. మరి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఎక్కడినుండో తొందరలోనే తేలిపోతుంది.

Similar News