పాదయాత్రకూ అనుమతి అవసరమా?

Update: 2016-11-14 04:14 GMT
కొన్ని అంశాల కారణంగా లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. తాజాగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యల కారణంగా ఏపీ ప్రభుత్వానికి జరుగుతున్న డ్యామేజ్ అంతాఇంతా కాదు. కాపులకు రిజర్వేషన్ల డిమాండ్ తెరపైకి రావటానికి నూటికి నూరుశాతం చంద్రబాబే కారణమనటంలో ఎలాంటి సందేహం లేదు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎవరూ అడగకుండానే చంద్రబాబు.. తాను పవర్ లోకి వచ్చాక కాపులను బీసీల్లోకి చేరుస్తూ నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

దీంతో.. ఆ వర్గ ప్రజలు బీసీ రిజర్వేషన్లపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా.. యుద్ధప్రాతిపదికన ఆ హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సంకేతాలు ప్రజల్లోకి వెళ్లినా పరిస్థితి మరోలా ఉండేది. కానీ.. కాపులకు ఇచ్చిన హామీ మాటేమిటంటూ కాపు ఉద్యమనేత  ముద్రగడ పద్మనాభం సీన్లోకి వచ్చి సూటిగా ప్రశ్నించే వరకూ ప్రభుత్వం నుంచి సమాధానం లేని పరిస్థితి. ఆయన చేపట్టిన భారీ బహిరంగ సభ హింసాత్మకం కావటం.. అనంతర పరిణామాలు పలువురు మీద వేలెత్తి చూపేలా చేసినా.. ప్రాథ‌మికంగా బాబుదే బాధ్యత అనే పరిస్థితి.

అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకూ కాపులకు ఇచ్చిన హామీల మీద ఎలాంటి నిర్ణయం తీసుకోనందుకే ముద్ర‌గ‌డ‌ సభను పెట్టాల్సి వచ్చింది కదా? అంటూ వేసే ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఏపీ అధికారపక్షం ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా కాపు సత్యాగ్రహ యాత్ర చేయాలని ముద్రగడ భావిస్తున్నారు. గాంధేయ మార్గంలో తామీయాత్ర చేస్తున్నట్లు ముద్రగడ చెబుతున్నా.. ఒకసారి యాత్ర మొదలయ్యాక ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

అందుకే అనుమతుల పేరిట పరిమితులు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే ముద్రగడ సైతం.. యాత్రకు డీజీపీ అనుమతి తీసుకోవాలని చెప్పటం తనకు విస్మయాన్ని రేకెత్తించిందని ముద్రగడ వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో చంద్రబాబుతో సహా.. పలువురు నేతలు పాదయాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయని.. వారంతా అనుమతి తీసుకునే చేశారా? అంటూ సూటిప్రశ్న సంధించారు. ముందుగా నిర్ణయించిన విధంగా ఈ నెల 16 ఉదయం తొమ్మిది గంటలకు రావులపాలెం మొయిన్ రోడ్డు నుంచి పాదయాత్ర మొదలవుతుందని ఆయన స్పష్టం చేస్తున్నారు. పాదయాత్రకు అనుమతులు కావాలని చెప్పే కన్నా.. అలాంటి అవకాశం లేకుండా కాపులకు ఇచ్చిన హామీని పరిష్కరిస్తే సరిపోతుంది కదా? అలా కాకుండా పరిమితుల పేరిట చేసే ప్రయత్నాలు కాపుల్ని మరింత ఆగ్రహానికి గురి చేస్తాయన్న విషయాన్ని మరవకూడదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News