మునుగోడు ఉప పోరు ఎప్పుడు? బీజేపీ నేతల్లో కొత్త అంతర్మధనం

Update: 2022-09-07 01:30 GMT
ఇప్పుడు ఆసక్తికరంగా మారిన మునుగోడు ఉప పోరుపై బీజేపీ ఒకటికి పది విధాలుగా ఆలోచిస్తుందా? ఉప పోరు ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుందన్న విషయంపై ఆ పార్టీలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు చూసినప్పుడు.. మునుగోడు విజయంపై ఆ పార్టీ చాలానే ఆశలు పెట్టుకుందన్న భావన కలుగక మానదు. ఇప్పటివరకు ఏ విషయం ఎలా ఉన్నా.. ఇప్పుడు జరిగే ప్రతి అంశంలోనూ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలని.. తొందరపడకూడదన్న భావనలో ఉన్నట్లు చెబుతున్నారు. అనుకోని రీతిలో జరగరానిది ఏమైనా జరిగితే.. ఇప్పటివరకు ఉందనుకున్న మైలేజీ మొత్తం మాయమవుతుందన్న ఆందోళన కమలనాథుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్లుగా బీజేపీ బలపడుతోందన్న సంకేతాలు స్పష్టంగా వస్తున్న వేళ.. దాన్ని మరింత బలోపేతం చేసుకోవాలే తప్పించి.. తప్పులతో ఉన్న మైలేజీని పోగొట్టుకూడదన్నది చర్చగా మారింది. మునుగోడులో ఇప్పటివరకు తమకు సానుకూలత ఉందన్న విషయాన్ని బీజేపీ నూటికి నూరు శాతం నమ్ముతోంది. పార్టీ పరంగా పెద్ద ఆదరణ లేనప్పటికీ.. అభ్యర్థి పరంగా ఉన్న బలమే తమ ప్రధాన ఆయుధంగా భావిస్తోంది. ఇదిలా ఉంటే.. ఉపపోరు ఎప్పుడు జరిగితే బాగుంటుందన్న దానిపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

కొందరు నేతల అభిప్రాయం ప్రకారం మునుగోడు ఉప ఎన్నికను వీలైనంత ఆలస్యంగా జరిపితే బాగుంటుందన్న మాట కొందరిదైతే.. మరికొందరు మాత్రం వీలైనంత త్వరగా నిర్వహిస్తేనే మంచిదన్న మాటను చెబుతున్నారు. ఆలస్యం ఎందుకన్న దానికి వారు చెబుతున్నదేమంటే.. హిమాచల్ ప్రదేశ్.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అయితే.. అక్కడి సానుకూల వాతావరణం బీజేపీకి బలంగా మారుతుందన్న లాజిక్ వినిపిస్తున్నారు.

దీనికి తోడు.. ఉప ఎన్నికకు గడువు ఫిబ్రవరి వరకు ఉండటంతో.. వీలైనంత ఆలస్యంగా నిర్వహిస్తేనే మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది. మునుగోడులో పార్టీ బలంగా లేదని.. అక్కడి నెగిటివ్ అంశాల్ని పాజిటివ్ గా మార్చుకోవటానికి సమయం అవసరం అవుతుందని.. అందుకే.. వీలైనంత ఆలస్యంగా నిర్వహిస్తే మంచిదన్న భావన వ్యక్తమవుతోంది. మరి.. త్వరగా ఉప ఎన్నికను నిర్వహించాలన్న దానిపైనా కొందరు తమ వాదనను వినిపిస్తున్నారు.

ఇప్పటికే మునుగోడులో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని.. అధికార టీఆర్ఎస్ ఇప్పుడు డిఫెన్సులో పడి ఉందని.. వారు ఒత్తిడిలో ఉన్న వేళలో ఉప ఎన్నిక నిర్వహిస్తే ఫలితం అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. టీఆర్ఎస్ కు సానుకూలంగా ఉందని సర్వేలు సీఎం చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నమన్న మాట మునుగోడు స్థానిక రాజకీయాల మీద అవగాహన ఉన్న వారు చెబుతున్నారు.

టీఆర్ఎస్ కు సానుకూలత ఉన్నప్పటికీ.. అదంతా కూడా అక్కడి వర్గాలన్ని కలిసి కట్టుగా పని చేస్తే మాత్రమే అన్న మాటను మర్చిపోకూడదంటున్నారు. తన మీద జరుగుతున్న ఎదురుదాడికి రియాక్టు అవుతూ.. తన దాడిని పెంచే విషయంలో కేసీఆర్ సిద్ధమవుతున్నారని.. ఇలాంటి వేళ.. ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా ఉప ఎన్నికను నిర్వహించాలని చెబుతున్నారు. అంతిమంగా.. మునుగోడుపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ఎన్నికల కమిషన్ అన్నది మర్చిపోకూడదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News