‘హోదా’పై టీడీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

Update: 2017-07-18 07:39 GMT
ప్రత్యేక హోదా విషయంలో సందర్భానికి తగ్గట్లుగా తెలుగుదేశం పార్టీ స్వరం ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిందే. మొదట ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు ఎంతో అవసరమని.. ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా అవసరమని అన్న ఆ పార్టీ నేతలు.. తర్వాత ‘ప్రత్యేక హోదా’తో అద్భుతాలు జరిగిపోవని.. అదేమీ సంజీవని కాదని కామెంట్ చేశారు. కేంద్రం మీద ఒత్తిడి తేలేక.. చివరికి ‘ప్రత్యేక ప్యాకేజీ’తో రాజీ పడిపోయారు. ఐతే ఏ పరిస్థితుల్లో తాము ప్యాకేజీకి ఒప్పుకున్నది మాత్రం ఆ పార్టీ నేతలు వివరించలేదు. దీనిపై అడిగినపుడల్లా దాట వేత సమాధానాలే వినిపించాయి. హోదా ఇవ్వకపోతే పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించడం కానీ.. కేంద్రంపై ఒత్తిడి తేవడం కానీ ఆ పార్టీ నేతలు చేయలేదు.

ఇదే విషయమై తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలుగుదేశం సీనియర్ నేత.. రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ ను అడిగితే.. ఆయన ఆశ్చర్యకర సమాధానం ఇచ్చారు. తెలుగుదేశం మూడేళ్ల పాలనపై మురళీ మోహన్ ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతుండగా.. హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తేలేకపోయారు అనే ప్రశ్న ఎదురైంది. దానికి బదులిస్తూ.. ‘‘కేంద్రంలో బీజేపీ చాలా బలంగా ఉంది. ఒకవేళ తెగించి మేం రాజీనామాలు చేసినా.. చేసేయండి అనడానికి వాళ్లు రెడీగా ఉన్నారు. అలాంటి స్థితిలో రాజీనామాలు చేయగలమా?’’ అన్నారు మురళీమోహన్. అంటే తాము తెగిస్తే పదవులు పోతాయని.. కాబట్టి పదవులు వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని మురళీ మోహన్ చెప్పకనే చెప్పారన్నమాట. అంటే పదవులే ముఖ్యం తప్ప.. ప్రత్యేక హోదా కాదని ఆయన ఒప్పుకున్నట్లే కదా? ఈ ఇంటర్వ్యూలో ఇంకా పలు ఇబ్బందికర ప్రశ్నలు ఎదురవగా.. అన్నింటికీ మురళీ మోహన్ దాటవేత సమాధానాలే ఇచ్చారు.
Tags:    

Similar News