భారత్ పాతాళయాత్ర ప్రత్యేకతలు తెలుసా?
ఈ నేపథ్యంలో... సముద్రలోతులను అన్వేషించగల సామర్ధ్యం ఉన్న అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, జపాన్ లు ఉన్న క్లబ్ లోకి భారత్ అడుగుపెట్టాలని చూస్తోంది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్.. అంతరిక్ష పరిశోధనల్లోనూ తన మార్కును చూపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా చంద్రయాన్ 3 తో ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేసుకుంది ఇస్రో. ఫలితంగా... అమెరికా, సోవియట్ యూనియన్, చైనా తర్వాత చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాలుగో దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది.
ఈ నేపథ్యంలో... సముద్రలోతులను అన్వేషించగల సామర్ధ్యం ఉన్న అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, జపాన్ లు ఉన్న క్లబ్ లోకి భారత్ అడుగుపెట్టాలని చూస్తోంది. దీనికోసం సుమారు రూ.4,077 కోట్లతో ఓ సరికొత్త ప్రాజెక్టును ముందుకు తెస్తోంది. దీనిలో భాగంగానే... "సముద్రయాన్" ప్రాజెక్టును వేగంగా ముందుకుతీసుకెళుతోంది.
అవును... అంతరిక్షాన్నే కాదు, సముద్రాలను కూడా అన్వేషించాలనే లక్ష్యంతో భారత్ చకచకా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సుమారు 12 గంటల వ్యవధిలో సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు వెళ్లి బయటకు వచ్చేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన మెషీన్ ను సిద్ధం చేసింది. దీనికి "మత్స్య-6000" అని నామకరణం కూడా చేసింది.
ఈ మత్స్య-6000 సబ్ బెర్సిబుల్ వెహికల్ ను అత్యవసర పరిస్థితులను తట్టుకునేలా సిద్ధం చేశారు. ఇందులో ఉండే సభ్యుల కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని కూడా డీ.ఆర్.డీ.వో. సిద్ధ చేసింది. ఇందులో సిబ్బంది 96 గంటల పాటు ఉండేలా ఏర్పాట్లూ చేశారు. ఈ మేరకు 67 ఆక్సిజన్ సిలిండర్లు పని చేస్తుంటాయి.
వాస్తవానికి సముద్రంలో 6,000 మీటర్ల లోతుకి వెళ్తే దీనిపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అది సుమారు 596 రెట్లు అధికంగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో... ఈ "మత్స్య-6000" ని సుమరు 80 ఎం.ఎం. మందంతో ఉన్న టైటాన్ అలాయ్ తో తయరుచేశారు. ఫలితంగా... ఇది సముద్రగర్భంలో 600 రెట్లు నీటి ఒత్తిడిని కూడా తట్టుకోగలవు.
దీనికి సంబంధించిన డిజైన్ వర్క్స్ ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సిద్ధం చేస్తోంది. వీటిల్లో లైఫ్ సపోర్ట్ సిస్టం, బ్యాటరీలు, కమ్యునికేషన్ పరికరాలు, ఆహారం, ఆక్సిజన్, వేస్టే మేనేజ్మెంట్ తో పాటు కార్బన్ డయాక్సైద్ ను బయటకు పంపే వ్యవస్థను ఏర్పాటు చేసింది.
ఇది నీటి అడుగున కెమోసింఠటిక్ బయోడైవర్సిటీ, హైడ్రోథర్మల్ వెంట్స్, తక్కువ ఉష్ణోగ్రతలో ఉన్న మీథేన్ వంటి వాటిపై పరిశోధనలు చేస్తుంది. ఇదే సమయంలో... ఈ సముద్రయాన్ విజయవంతమైతే భారత్ లో పూర్తిస్థాయిలో “డీప్ సీ” రంగానికి చెందిన పరిశ్రమలు పుట్టుకొస్తాయని అంటున్నారు. అదేవిధంగా.. సముద్రగర్భ టూరిజం కూడా అభివృద్ధికి ఇది సహకరిస్తుంది!