హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఈ శపథం చేశారు

Update: 2015-09-15 06:07 GMT
హైదరాబాద్ పాతబస్తీ అన్న వెంటనే చాలామందికి చాలానే అభిప్రాయాలు ఉంటాయి. కానీ.. చాలామంది కలలో కూడా ఊహించని ఒక పరిణామం.. విన్నంతనే నిజమా అనుకునే మాట ఒకటి తాజాగా చోటు చేసుకుంది. గో వధ మీద దేశ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తుంటే.. హైదరాబాద్ పాతబస్తీలో మాత్రం మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

బర్కస్ ప్రాంతానికి చెందిన అరబ్ గోరక్షణ సమితికి చెందిన ఒక ముస్లిం యువ బృందం సరికొత్త శపధం చేశారు. బక్రీద్ పర్వదినం నాడు గోవుల్ని హతమార్చకుండా చూస్తామని వారు చెబుతున్నారు. ఇతర మతాలకు చెందిన విశ్వాసాలను దెబ్బ తీసే చర్యల్ని తాము అడ్డుకోవాలని నిర్ణయించినట్లుగా వారు చెబుతున్నారు. ఈ గ్రూప్ అధ్యక్షుడు.. న్యాయవాది అయిన అబ్దుల్లా బిన్ అలీ బహమైద్ మాట్లాడుతూ.. ముస్లిం.. హిందువుల మధ్య చక్కటి సంబంధాలు ఉండేలా చూడటమే తమ లక్ష్యంగా ఆయన చెబుతున్నారు.

రెండు మతాల మధ్య నమ్మకం లోపిస్తే.. దేశాభివృద్ధిని కుంగదీస్తుందన్నారు. భారతదేశంలోని చట్టాల ప్రకారం గోమాంసం మీద నిషేధం ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. గోవుల్ని రక్షిస్తామని ఒక ముస్లిం గ్రూప్ శపధం చేయటం ఒక కొత్త పరిణామంగా చెప్పాలి.
Tags:    

Similar News