గోర‌క్ష‌ణ‌లో ముస్లిం మ‌హిళ‌- దాడి చేసిన ముస్లింలు

Update: 2018-07-01 14:30 GMT
స‌హ‌జంగా దేశంలో గో ర‌క్ష‌ణ అన‌గానే వినిపించేది...ఆవులను సంర‌క్షించే వార‌మ‌ని పేర్కొంటూ ప‌లువురు ఇత‌రుల‌పై దాడుల‌కు దిగుతుంటారు. ఇందులో దాడి చేసేది హిందుత్వ వాదులు కాగా..దాడుల‌కు గుర‌య్యేది ముస్లింలు - ద‌ళితులు అని ప‌లు ఉదంతాలు వెల్ల‌డించాయి. అయితే తాజా ఘ‌ట‌న‌లో సీన్ రివ‌ర్స్ అయింది. గోర‌క్ష‌ణ కేంద్రాన్ని నిర్వ‌హిస్తున్నందుకు దాడి జ‌రిగింది. అలా నిర్వ‌హిస్తున్న మ‌హిళ‌ - దాడికి గురైన వ్య‌క్తి ముస్లిం కావ‌డం కొస‌మెరుపు!. గో రక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఒక ముస్లిం మహిళపై భోపాల్‌ లో శుక్రవారం కొందరు వ్యక్తులు దాడి చేయ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.

ఆమె పేరు మెహ్రున్నిసా. మధ్యప్రదేశ్‌ లోని నీముచ్ జిల్లా కేంద్ర నివాసి. ఆమె జాతీయ గో సేవా దళం మధ్యప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా. గో రక్షణకు పాల్పడుతున్న ఆమెకు ఇంటా బయటా వేధింపులు ఎదురవుతున్నాయి. తరుచుగా తనను బెదిరిస్తున్న వ్యక్తులు వచ్చేసారి యాసిడ్ దాడి చేస్తారేమోనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వారు తనను చంపేందుకు సిద్ధంగా ఉన్నారని - కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని, తనకు భయం వేస్తున్నదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను బయటి వ్యక్తులే కాదు కుటుంబ సభ్యులు కూడా బెదిరిస్తుండ‌టం ఆశ్చ‌ర్య‌క‌రం. తన అత్తింటి వారు కొట్టారని - గో రక్షణ కేంద్రం నిర్వహణ బాధ్యతలు వదిలి వేయాలని హెచ్చరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులతోపాటు కూతురు కూడా ఆమెకు మద్దతునిచ్చేందుకు నిరాకరిస్తుండ‌టం ప‌ట్ల ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

వాట్సప్‌లో బెదిరిస్తూ తలలు నరికేసిన ఫోటోలు పంపుతున్నారని, త్వరలో తనకు అదే గతి పడుతుందని హెచ్చరించారని తెలిపారు. తనను చంపనైనా చంపండి, రక్షించనైనా రక్షించండని కోరారు. తనకు సాయం చేయాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ - ప్రధాని నరేంద్రమోడీలకు విజ్ఞప్తి చేశారు. నాలుగు నెలల క్రితం పోలీసుల వద్దకు వెళితే కుటుంబ సమస్యగా కొట్టి పారేశారని వాపోయారు. గో రక్షణకు పాటుపడటంతోపాటు ట్రిపుల్ తలాక్‌ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు అత్తింటి వారు కొట్టి దుర్భాషలాడుతున్నారని తెలిపారు. ఇలాంటి చ‌ర్య‌ల‌పై లౌకిక వాదులు ఏం స‌మాధానం ఇస్తార‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.


Tags:    

Similar News