ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన ప్రజలు!

Update: 2017-09-15 05:07 GMT
ఫిరాయింపుల వ్యవహారం పట్ల రాజకీయ నేతలు సిగ్గు లేనట్టుగా వ్యవహరిస్తున్నా.. ప్రజలకు మాత్రం ఈ విషయంలో చాలా పట్టింపులే ఉన్నాయని స్పష్టం అవుతోంది. ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచేసి.. ఎంచక్కా మరో పార్టీలోకి జంప్ చేసేసి.. ఎమ్మెల్యేలు సంతలో పశువుల్లా వ్యవహరిస్తున్నారు. ఈ సంతలో పశువు అనే మాట.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుదే. ఫిరాయింపు ఎమ్మెల్యేలను సంతలో పశువులుగా అభివర్ణించి - మరోవైపు అదే ఫిరాయింపులను తను చేయిస్తున్న ఘటికుడు ఆయన. మళ్లీ మాటెత్తితే చంద్రబాబు నీతులు చెబుతారు. తను ‘విలువల’తో కూడిన రాజకీయం చేస్తున్నా.. అని అంటారు. మరి బాబుగారు చేస్తున్న విలువలతో కూడిన రాజకీయం ఏమిటో అందరికీ స్పష్టం అవుతోంది. ఎమ్మెల్యేలకు ఒక విలువ కట్టి ఆయన కొనుక్కొంటున్నాడు అనే అభిప్రాయం ప్రజల నుంచినే వ్యక్తం అవుతోందిప్పుడు.

ఇందుకు రుజువు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డికి ఎదరైన అనుభవం. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో పాల్గొన్న అశోక్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. పచ్చకండువా వేసుకుని... టీడీపీ తరపున ఇంటింటికీ వెళ్లిన ఈ ఎమ్మెల్యేకు చెమట్లు పట్టాయి. అలసటతో కాదు.. నిలదీతలతో! ఈయన తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుని నిస్సిగ్గుగా జనం మధ్యకు వెళ్లాడు కానీ, జనాలు మాత్రం గట్టిగానే మాట్లాడాడు. మొన్నటి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి.. ఆ పార్టీ కండువాతో వెళ్లి ఓటు అడిగిన అశోక్ రెడ్డి ఇప్పుడు పచ్చ కండువాతో వచ్చే సరికి జనాలు నిలదీశారు.

‘అప్పుడు వైకాపాకు ఓటు వేయమని అడగడానికి వచ్చావ్.. ఇప్పుడు తెలుగుదేశం అంటూ వచ్చావేంటి?’ అని వ్యంగ్యాన్ని - నిలదీతను కలిపి ప్రశ్నించారు గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రజలు. అందరూ కాదు కానీ.. ఈ రాజకీయ వ్యభిచారాన్ని సహించలేని ప్రజలు.. ఘాటుగా ప్రశ్నించారు. ఈ ఫిరాయింపు ఏమిటి? అని నిలదీశారు. మరి ఈ ప్రశ్నను ఊహించని అశోక్ రెడ్డి సమాధానం చెప్పడానికి ప్రయత్నించాడు. డెవలప్ మెంట్ కోసం.. అని వారిని సముదాయించ యత్నించాడు. అయితే ఈ సమాధానానికి మరో ఘాటు ప్రశ్న ఎదురైంది.

ఫిరాయించి కూడా ఏడాది అవుతోంది కదా.. మరి ఇన్ని రోజుల్లో చేసిన డెవలప్ మెంట్ ఏమిటి? అని ప్రశ్నించారు నిలదీసిన వాళ్లు. డెవలప్ మెంట్ కోసం పార్టీ మారావని చెబుతున్నావు బాగానే ఉంది కానీ, మరి చేసిన డెవలప్ మెంట్ ఏమిటి? అని మరో ప్రశ్న శరంలా వచ్చే సరికి గుటకలు మింగడం అశోక్ రెడ్డి వంతు అయ్యింది. ఏదో చేస్తున్నాం.. అని చెప్పి నమస్కారాలు పెట్టుకుంటూ ముందుకు సాగాడు ఈ ఎమ్మెల్యే!

ఇదీ ఫిరాయింపుదారులకు ఎదురవుతున్న ప్రశ్న, వీళ్లకు ఓటేసి గెలిపించిన వాళ్లు అడుగుతున్న ప్రశ్న. ‘ఏమిటీ రాజకీయ వ్యభిచారం..?’ అని సూటిగా ఘాటుగా అడుగుతున్నారు ప్రజలు. మరి ఈ ప్రశ్నకు సమాధానాన్ని రెడీ చేసుకునే ఫిరాయింపుదారులు ప్రజల మధ్యకు వెళితే మంచిదేమో! రాజకీయ ఫిరాయింపులను పట్టించుకోనంత ఉదారభావంతో లేరు ప్రజానీకం. ఈ విషయాన్ని ఫిరాయింపుదారులు గుర్తుంచుకోవాలి సుమా!
Tags:    

Similar News