సీఎం దెబ్బ‌కు చాయ్ వాలాలు పెరిగిపోయారు

Update: 2017-03-31 04:20 GMT
బీజేపీ ఫైర్ బ్రాండ్ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే ప్రభుత్వ కార్యాలయాల రూపురేఖలు మారాయి. ఇకపై నవాబు లెక్కలు నడవయని ప్రభుత్వోద్యోగులు 18 నుంచి 20 గంటలు పనిచేయాల్సిందేనని సీఎం చేసిన హెచ్చరికతో ప్రభుత్వోద్యోగులు ఎక్కడికక్కడ సర్దుకున్నారు. ప్రభుత్వ దస్ర్తాలను ఇండ్లళ్లకు తీసుకెళ్లొద్దని చెప్పిన విషయాన్ని సీరియస్‌ గా తీసుకున్నారు. చేస్తే ఉద్యోగం చేయండి లేకుంటే ఇంట్లో కూర్చోండి అని చేసిన అదిరింపుకు జడుసుకున్నారు. దీంతో కచ్చితంగా టైం టేబుల్ పాటిస్తున్నారు. దీంతో ప‌రిస్థితి ఒక్క సారిగా మారిపోయింది.

ఇప్పుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని ఉద్యోగులు ఉదయం 9 గంటలకల్లా కార్యాలయాల్లో తమ విధులకు హాజరవుతున్నారు. సీఎం హెచ్చరికలతో ఉద్యోగుల హాజరు శాతం పెరిగింది. బయోమెట్రిక్ విధానం కూడా ఇందుకు పూర్తిగా సహకరిస్తుంది. ఉద్యోగులే కాదు సీనియర్ మంత్రులు కూడా తమ విధులకు టైం ప్రకారం వస్తున్నారు. తమ తమ కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకుంటున్నారు. ఫైల్లు ఎక్కడ పెట్టాలో, ఎవరెవరికి పంపించాలో ఉద్యోగులను పురమాయిస్తున్నారు. అంతే కాదు ప్రభుత్వ కార్యాలయాల్లో గుట్కా నిషేధం కచ్చితంగా పాటిస్తున్నారు. ఎవరైనా గుట్కా నమిలితే బలవంతంగా ఉమ్మేయిస్తున్నారు. రాష్ట్ర అటవీశాఖ కార్యాలయంలోనైతే ఏకంగా బోర్డునే పెట్టారు. గుట్కా నమిలిన వారికి రూ.1000 జరిమానా విధించబడును అని హెచ్చరికతో బోర్డు ఏర్పాటు చేశారు. దీనిని గమనించడానికి సీసీ టీవీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. దీంతో చాలా ప్రభుత్వ కార్యాలయాల వద్ద గుట్కా మరకలులేని, చెత్త చెదారంలేని పరిశుభ్రమైన వాతావరణం కనిపిస్తుంది.

మ‌రోవైపు యూపీలో కబేళాలు మూతపడుతుండటంతో మాంసం విక్రయదారులు ప్రత్యామ్నాయ మార్గాలవైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా ముజఫర్‌ నగర్‌ లో ముగ్గురు మాంస విక్రయదారులు టీ వ్యాపారులుగా మారారు. తాము నిర్వహించిన మాంసం దుకాణాలకు లైసెన్సులున్నా, అధికారులు వాటిని మూసివేశారని వ్యాపారులు ఆరోపించారు. తన షాపుకి లైసెన్సు ఉన్నా బలవంతంగా మూసివేశారని, చేసేదేమీ లేక టీ అమ్ముతున్నానని నఝకత్ అనే వ్యాపారి వెల్లడించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం యోగీ ఆదిత్యనాథ్ యూపీలో కబేళాలు, మాంసం దుకాణాలపై దాడులు నిర్వహించి, వాటిని మూసివేయించిన విషయం తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News