అట‌కెక్కిన అమ‌రావ‌తి ఇటుక‌ల అమ్మ‌కం

Update: 2017-06-28 06:03 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం కోసం ప్ర‌తిపాదించిన `నా ఇటుక- నా అమరావతి` అంశం అట‌క ఎక్కింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజధాని నిర్మాణానికి నేను సైతం అంటూ ప్రజలందరినీ భాగస్వాములు చేసేందుకు 2015 అక్టోబర్ 22వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆన్‌ లైన్ ద్వారా నా ఇటుక- నా అమరావతి పేరిట ఇటుకల బుకింగ్‌ ను అట్టహాసంగా ప్రారంభించారు. ఒక్కో ఇటుకకు రూ. 10 ధర నిర్ణయించారు. అప్పట్లో ఇటుకలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు సైతం ఇటుకలను బుక్ చేశారు. ప్రజల నుంచి కూడా విశేష స్పందన వచ్చింది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అభిమానులు స్పందించి లక్షలాది ఇటుకలపై బాలయ్య చిత్రంతో ముద్రిస్తున్నట్లు ప్రకటించారు. ఇలా ప‌లు రూపాల్లో రూ. ఐదు కోట్లకు పైగా ఆదాయం కూడా వచ్చింది. ఈ క్ర‌మంలోనే రాజధాని ప్రాధికార సంస్థ (సిఆర్‌ డిఎ) నిర్వహణలో ఆన్‌ లైన్ ద్వారా రోజుకు ఎవరెవరు...ఎన్ని ఇటుకలు కొనుగోలు చేశారో డిస్ ప్లే కూడా ఏర్పాటు చేశారు.

అమరావతి ఇమేజిని ప్రపంచ వ్యాప్తం చేయాలనే ముఖ్యమంత్రి సంకల్పంలో భాగంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపున‌కు వ‌స్తున్న స్పంద‌నగా పెద్ద ఎత్తున కొనుగోలు సాగిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇప్పటి వరకు 2లక్షల 26వేల 952 మంది 56లక్షల 62వేల 473 ఇటుకలు కొనుగోలు చేసినట్లు సీఆర్‌డిఎ వెబ్‌సైట్ చూపుతోంది. చిత్రంగా సిఆర్‌డిఎ వెబ్‌సైట్‌లో ఏడాది కాలానికి పైగా తేదీ మారుతోంది తప్ప ఇటుకల బేరం కదలటంలేదు! రాజధాని భవనాలన్నీ సింగపూర్ తరహాలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్లతో నిర్మితమవుతున్న నేపథ్యంలో అమరావతి ఇటుకలను సిఆర్‌ డిఎ అధికారులు విస్మరించారనే విమర్శలు కూడా వ‌స్తున్నాయి. అసలు అమరావతి ఇటుక ఎక్కడ తయారు చేయిస్తారు. ఎన్ని లక్షల ఇటుకలకు ఇప్పటి వరకు ఆర్డర్ ఇచ్చారు.. మున్ముందు ప్రజలను ఎలా జాగృతం చేయనున్నారనే విషయాలపై స్పష్టతలేదు. దీంతోని అమరావతి ఇటుకకు బేరాలు కుదరటంలేదని అంటున్నారు.

అమరావతికి ఇటుక అమ్మకాలకు ప‌లువురు మంత్రులు - ఎమ్మెల్యేలే స్పందించలేదనే ప్ర‌చారం కూడా సాగుతోంది. అధికార పార్టీకి చెందిన నేతలు కూడా దీన్ని విస్మరించారని అంటున్నారు. స‌హ‌జంగానే ప్రజల్లో ఆసక్తి తగ్గిందని చెప్తున్నారు. రాజధాని శంకుస్థాపనకు పవిత్రజలాలు, మట్టిని వివిధ ప్రాంతాల నుంచి సేకరించి తీసుకువచ్చిన ఉత్సాహం నిర్మాణంపై కనిపించటంలేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. స్థూలంగా అమ‌రావ‌తి విష‌యంలో నా ఇటుక అంశం అట‌క ఎక్కిన‌ట్లే అని ప‌లువురు నిట్టూరుస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News