జనసేన కీలక భేటీ... ఆ ఇద్దరూ కనబడలే!

Update: 2019-06-06 17:03 GMT
ఏపీలో జరిగిన తాజా ఎన్నికల్లో సమరశంఖం పూరించి బొక్క బోర్లా పడిన జనసేన దాదాపుగా క్లోజింగ్ దిశగానే సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో కీలక ఘట్టం పోలింగ్ తర్వాత కాస్తంత రెస్ట్ తీసుకుని తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి ఓ మారు వచ్చి వెళ్లిన జనసేనాని పవన్ కల్యాణ్ ఆ తర్వాత అడ్రెస్ లేకుండా పోయారు. అయితే ఏమనున్నారో - ఏమో తెలియదు గానీ... గురువారం మరోమారు పార్టీ కార్యాలయానికి వచ్చిన పవన్ కాస్తంత హడావిడి చేశారు. అయితే ఈ హడావిడిలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ముఖ్య నేతలు మాత్రం పార్టీ అధినేత నిర్వహించిన సమీక్షలో కనిపించకుండాపోయారు. వారిద్దరు ఎవరంటే... పవన్ వెన్నంటే తిరిగిన నాదెండ్ల మనోహర్ - విశాఖ ఎంపీ సీటు నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి పార్టీలో ఓ మోస్తరు ఊపు తెచ్చిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణలే.

ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ భవిష్యత్తు ఏమిటన్న విషయాన్ని తేల్చేందుకు పవన్ తాడేపల్లి కార్యాలయానికి రాగా... ఈ ఇద్దరు మాత్రం అక్కడ కనిపించలేదు. దీంతో వారిద్దరూ ఎందుకు ఈ భేటీకి రాలేదన్న కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ విశ్లేషణలు ఇక జనసేన కార్యాలయానికి మూతపడినట్టేనన్న కోణంలోనూ సాగుతుండటం విశేషం. నాదెండ్ల మనోహర్ పార్టీలో చేరిన నాటి నుంచి పవన్ వెన్నంటే నడిచారు. పవన్ ఎక్కడికెళ్లినా ఆయన పక్కనే కనిపించారు. పార్టీలో నెంబర్ టూగా కనిపించిన నాదెండ్ల... ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం తెనాలి నుంచి పోటీ చేశారు. అయితే వైసీపీ వైపు వీచిన గాలిలో నాదెండ్ల కొట్టుకుపోయారు.

ఇక లక్ష్మీనారాయణ పరిస్థితి కూడా అంతే. ఎన్నికల్లో హామీలిచ్చి మరిచిపోయే వ్యక్తిని కాదని, ఏకంగా బాండ్ పేపర్ పై హామీలను రాసిచ్చిన లక్ష్మీనారాయణ గెలిచేస్తారేమో అన్నంతగా కలరింగ్ ఇచ్చారు. అయితే విశాఖ జిల్లాలోనూ వైసీపీ వైపు వీచిన గాలిలో లక్ష్మీనారాయణ కూడా కొట్టుకుపోయారు. ఈ ఓటమి వారిద్దరినీ బాగానే కలచివేసినట్టుంది. అంతేకాకుండా ఏకంగా పార్టీ అధినేతే రెండు చోట్ల పోటీ చేసినా కనీసం ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. దీంతో ఇక జనసేన పని అయిపోయినట్టేనన్న భావనతోనే వారిద్దరూ సైడైపోయారన్న వాదన వినిపిస్తోంది. జనసేనతో తమకు ఒరిగేదేమీ లేదన్న భావనతో వారిద్దరూ పార్టీకే దూరంగా జరిగినట్టుగా కూడా విశ్లేషణలు కొనసాగుతున్నాయి. మొత్తానికి ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా ఏపీకి వచ్చిన పవన్ కు వీరద్దరూ పెద్ద షాకే ఇచ్చారని చెప్పక తప్పదు.


Tags:    

Similar News