జనసేన లో నాదెండ్ల రచ్చ..మరో టీడీపీ కాదు కదా!

Update: 2020-02-04 13:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ప్రజలకి మంచి చేయాలనే మంచి లక్ష్యంతో జనసేన పార్టీని స్థాపించి ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసారు...ఇప్పటికి కూడా చేస్తున్నారు. జనసేన అంతిమ లక్ష్యం కాదు అధికారం కాదు ..ప్రజలకి మంచి జరగడమే అనే నినాదంతో ముందుకు వచ్చిన జనసేనలో ఈ మధ్య భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. కానీ, అప్పటికి కూడా పార్టీలో నమ్మకం మాత్రం కోల్పోలేదు. ఆ తరువాత  ఎన్నికల షాక్ నుండి కోలుకొని మళ్లీ జనసేన ప్రజల కోసం పోరు బాట పట్టింది. ఇదంతా కాసేపు పక్కన పెడితే ..గత కొన్ని రోజులుగా జనసేన పార్టీలో చేరే నేతలకంటే ..పార్టీ లో నుండి బయటకి వెళ్లేవారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం జనసేన లోని ఒక కీలక నేత అని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

జనసేన లో పవన్ తరువాత అంతా తానే పార్టీని నడిపిస్తున్న అయన - జనసేన నుంచి వరుసగా నేతలు బయటకు రావడానికి ఆ‍యన వ్యవహార తీరే కారణమన్న ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఆయన పర్మిషన్ ఇస్తేనే పవన్‌ ను కలిసేంత కట్టుదిట్టం చేశారా అంటే అవుననే వినిపిస్తోంది? ఆయన పెత్తనాన్ని భరించలేక పార్టీలో నుండి ఒక్కొక్కరు బయటకి వెళ్లిపోతున్నారు. పార్టీ అంటే ఒక్కరో - ఇద్దరో కాదు. కొంతమంది సమూహం. ఈ విషయాన్ని అధినేత ఎందుకు గుర్తించడం లేదో మరి. అసలు జనసేన పార్టీనే పవన్ అయన చేతుల్లో పెట్టేశారన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ జనసేన పార్టీని ఒంటిచేత్తో శాసిస్తున్న ఆ కీలకనేత ఎవరు? సొంత పార్టీ నేతలకు సైతం అయన అంటే ఎందుకంత కోపం?

మొన్న మాజీ ఎమ్మెల్యే ఆకుల - నిన్న పార్టీ సిద్దాంత కర్త రాజు రవితేజ తీవ్ర ఆరోపణలు చేస్తూ రాజీనామా చేశారు. తాజాగా ఏకంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీలో కొనసాగలేను అంటూ బయటకి వచ్చేసారు.  వీళ్లందరూ బయటకు రావడానికి పవన్‌ తీరు - సిద్దాంతాల మార్పు ఒక కారణం అయితే...దాని వెనుక అసలు కారణం మరొకటి ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ పార్టీ అధినేత  తర్వాత, పార్టీలో అన్ని తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న ఆ లీడర్‌ ఎవరు? ..అయన మరెవరో కాదు ..నాదెండ్ల మనోహర్ అట. చూడ్డానికి సౌమ్యంగా - పార్టీ అధినేతకు రైట్‌ హ్యాండ్‌ లా కనిపిస్తున్న నాదెండ్లే - పార్టీలో సంక్షోభం తలెత్తడానికి ప్రధాన కారణం అని -  జనసేన పార్టీ బయటికొచ్చేసిన నేతలు తమ అనుచరులతో అంటున్నారట.

అధినేత చాలా కార్యక్రమాలలో బిజీగా ఉండి - పార్టీ బాధ్యతలన్నీ - నాదెండ్లకు అప్పగించేశారని - దీంతో నాదెండ్ల చెప్పిందే వేదం - చేసిందే శాసనం అన్నట్టుగా నడుస్తోందని మండిపడ్తున్నారట. అలాగే అయన చాలా విషయాల్లో పవన్‌ను తప్పుదారి పట్టిస్తున్నారని మణ్డిపడుతున్నారట. ముఖ్యంగా ఈయన బాధితుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ..జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్..ఈయన కూడా నాదెండ్ల భాదితుడేనట. పవన్ ని కలవాలని ఎన్నిసార్లు అడిగినా , ఎంతసేపు ఎదురుచూసినా కూడా కలవనీయలేదు అనే ప్రచారం జరుగుతోంది. తాను పార్టీ కార్యక్రమాలకు వస్తే, గెలిచిన రాపాకకు చప్పట్లు కొడతారని - పవన్‌ తో పాటు తామూ ఓడిపోయాం కాబట్టి - అది తమకు ఇబ్బందికరంగా మారుతుందని నాదెండ్ల ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతున్నారని, రాపాక తన అనుచరులతో ఆవేదన పంచుకున్నారట. దళిత ఎమ్మెల్యేనైన తనపట్ల, నాదెండ్ల దరుసుగా ప్రవర్తించారని - గౌరవం ఇవ్వకుండా మాట్లాడారని, చాలాసార్లు తన సన్నిహితుల దగ్గర వేదన వెళ్లగక్కారట రాపాక. అందుకే పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మారాల్సి వస్తోందని అంటున్నారట రాపాక.

ఇక జనసేన నుండి బయటకి వచ్చిన మరో జనసేన ముఖ్యనేత రాజు రవితేజ.ఈయన జనసేన పార్టీ సిద్దాంతకర్త. పవన్‌ అంతరంగాన్ని ఆవిష్కరించే ఇజమ్‌ పుస్తక రచయిత కూడా ఈయనే. ఈయన కూడా ఈ మద్యే జనసేనకు రాజీనామా చేశారు. పవన్‌ కల్యాణ్‌ సిద్దాంతాలు - భావజాలంలో చాలా తేడా వచ్చిందని - అందుకే తాను పార్టీ నుంచి బయటికొచ్చేశానని  రాజీనామా అనంతరం తెలిపారు. చేగువేరా బొమ్మ పెట్టి - కమ్యూనిస్టులతో చెలిమి చేసిన పవన్‌, ఇఫ్పుడు బీజేపీకి దగ్గరకావడానికి, ఆ పార్టీ భావజాలాన్ని భుజాలపై మోయడానికి, నాదెండ్ల మనోహరే కారణమని, తన సన్నిహితుల దగ్గర ప్రస్తావించారట.

ఇక తాజాగా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఈ‍యన సైతం అనూహ్య పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేశారు. పవన్‌లో నిలకడలేకపోవడం - మళ్లీ సినిమాలకు క్లాప్‌ కొట్టడమే కారణమని, లేఖలో చెప్పినా - తెర వెనక కారణాలు వేరే వున్నాయన్నది - జనసైనికుల మాట. సమాజంలో తనకెంతో ఫాలోయింగ్ వున్నా - పార్టీలో కనీస గుర్తింపులేదని, అందుక్కారణం నాదెండ్ల మనోహరేనని జేడీ లోలోపల రగిలిపోతున్నారట. బీజేపీతో పొత్తు నిర్ణయం, సంప్రదింపుల్లోనూ తనను ఏమాత్రం ఇన్‌ వాల్వ్ చేయలేదని - నాదెండ్ల ఆలోచనలతోనే - పవన్‌ తనను పక్కకు పెడుతున్నారన్నది జేడీ భాద.

అలాగే ఈ భాదితుల్లో మెగా బ్రదర్ నాగబాబు కూడా ఉన్నారట. పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీలో నాగబాబు కూడా కీలక సభ్యుడిగా వున్నా - నాదెండ్ల  - నాగబాబు ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అనే చర్చ బయట పెద్ద ఎత్తున నడుస్తుంది. మొత్తంగా జనసేన నుంచి బయటికి వెళ్లిపోతున్న వారందరు కూడా పవన్‌ తో పాటు నాదెండ్లను కూడా టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అలాగే నాదెండ్ల మాటలమాయలో పడి పార్టీ నిర్మాణంపై పవన్ పెద్దగా దృష్టి పెట్టడం లేదు అనే విమర్శ కూడా వినిపిస్తుంది. అయితే , నాయకులు చెప్తున్నట్టు పార్టీలో నాదెండ్ల ప్రభావం ఎంతమేర ఉందొ తెలియదు కానీ ..వారందరు చెప్తున్నట్టు అదే కనుక నిజమైతే మరోసారి గతంలో టీడీపీ ఎదుర్కొన్న పరాభవాన్ని జనసేన కూడా ఎదుర్కొనే అవకాశం అతి త్వరలోనే ఉందని కొందరు రాజకీయ ఉదండులు తెలుపుతున్నారు. చూడాలి మరి పవన్ ..జనసేన పార్టీ ని ఎలా ఒడ్డుకి చేర్చుతారో ...
Tags:    

Similar News