అమ్మ‌కు ఊహించ‌ని మ‌ద్ద‌తు దొరికింది

Update: 2016-09-13 08:22 GMT
కావేరి నదీ జలాల వివాదంతో క‌ర్ణాట‌క-త‌మిళ‌నాడుల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఆయా రాష్ట్రాల‌లోని ప్ర‌జానికం త‌మ‌దైన శైలిలో అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తుండ‌గా రాజ‌కీయ నాయ‌కులు స్వ‌త‌హాగానే వివాదం ముదిరేలా చేస్తున్నారు. అయితే సున్నిత‌మైన సినీప‌రిశ్ర‌మ ఈ విష‌యంలో ముందుకు త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డించింది.  ముఖ్యమంత్రి జయలలిత తీసుకొనే అన్ని చర్యలకు దక్షిణ భారత నటుల సంఘం సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. నడిగర్‌ సంఘంగా పిలుస్తున్న దక్షిణ భారత నటుల సంఘం కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

న‌డిగ‌ర్ సంఘం అధ్యక్షుడు నాజర్‌ అధ్యక్షతన చెన్నైలో జరిగిన స‌మావేశంలో కావేరీ నదీ జలాల వివాదంపై ముఖ్యమంత్రి జయలలిత తీసుకొనే అన్ని చర్యలకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ వివాదంలో కన్నడ నటుల వైఖరిని ఖండిస్తూ, తమిళనాడు హక్కులను పరిరక్షించడానికి పోరాడాలనే పలు కీలక తీర్మానాలు ఆమోదించారు. కావేరీ వివాదంపై నడిగర్‌ సంఘం ఆందోళనలు చేయాలా.. వద్దా? అనే అంశంపై సంఘంలో భిన్నాభిప్రాయాలు వినిపించడంతో సుమారు 3 గంటలపాటు చర్చ కొనసాగింది. అలాగే నటి డిస్కోశాంతి తమ్ముడు - నటుడు అరుణ్‌ మొళి వర్మన్‌ సంఘం నిర్వాహకులకు ఓ లేఖ ఇచ్చారు. అందులో... చెన్నైలో 18వ తేదీన జరిగే సెలెబ్రిటీ బ్యాడ్మింటన్‌ లీగ్‌ పోటీల్లో కన్నడ నటులూ పాల్గొననున్నారని, ప్రస్తుతం కావేరీ నదీ జలాల సమస్యపై ఆందోళనలు కొనసాగుతుండటంతో ఇది సమస్యను మరింత జఠిలం చేసే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఆ లీగ్‌ పోటీలను వాయిదా వేయాలని, కావేరీ నదీ జలాల వివాదం కన్నా ఈ పోటీలు అంత ప్రాధాన్యత సంతరించుకోలేదని పేర్కొన్నారు. సమావేశం అనంతరం న‌డిగ‌ర్ సంఘం కార్య‌ద‌ర్శి విశాల్‌, నాజర్‌ తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం జ‌య‌ల‌లిత‌కు బాస‌ట‌గా నిల‌బ‌డాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు.
Tags:    

Similar News