నాగార్జున సాగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు

Update: 2021-03-29 11:30 GMT
తెలంగాణలో నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు అన్ని పార్టీలు కూడా సంసిద్ధం అవుతున్నాయి.  అభ్యర్థి పేర్లను ఖరారు చేసే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ , బీజేపీ  సాగర్ ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించింది. తాజాగా టీఆర్ ఎస్ పార్టీ కూడా తన అభ్యర్థిని ఖరారు చేసింది. సాగర్ టీఆర్ ఎస్ అభ్యర్థిగా నోముల నర్సింహాయ్య తనయుడు భగత్ పేరు అధిష్టానం ఖరారు అయ్యింది. మరికాసేపట్లో  ఆయన పేరును పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గతేడాది డిసెంబర్‌లో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇప్పుడు ఆయన కుమారుడికే టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ టికెట్ కోసం కోటిరెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ , ఆయనతో  మినిస్టర్ జగదీష్ రెడ్డి మంతనాలు జరిపి భగత్ కి సీటు కేటాయించేలా చేశారు.  తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ నోముల భగత్‌కు బీ-ఫాం అందజేశారు. భగత్‌ రేపు ఉదయం నిడమనూరులో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. సాగర్‌ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రతి అంశాన్నీ సీఎం కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌లో జరిగిన నష్టాన్ని పట్టభద్రుల ఎన్నికల్లో పూడ్చుకున్నామని.. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో భారీ మెజారిటీ సాధించాలని అధినేత కేసీఆర్ సూచించారు.

 మరోవైపు ఇప్పటికే సాగర్ ఉప ఎన్నిక కోసం తొలిరోజు 5 నామినేషన్లు దాఖలయ్యాయి. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు గడువు ఉంది. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఏప్రిల్‌ 17న ఎన్నికల పోలింగ్‌ జరుగనుండగా.. మే 2న ఫలితం వెల్లడికానుంది. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని ప్రకటించింది. సిట్టింగ్‌ స్థానం కావడంతో అభ్యర్థి ఎంపికపై టీఆర్‌ఎస్‌ తీవ్ర కసరత్తు చేసింది.  బీజేపీ అభ్యర్థిగా కంకణాల నివేదిత రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది అధిష్టానం. దీంతో రేపు నివేదిత రెడ్డి తన నామినేషన్‌ వేయనున్నారు.
Tags:    

Similar News