సాగర్ బరిలో వైసీపీ: టీఆర్ఎస్ కు లాభమా? నష్టమా?

Update: 2021-03-26 05:12 GMT
మిత్రుడు కాస్త శత్రువయ్యాడా? ఆపదలో ఆదుకునేందుకు వచ్చాడా? ఇన్నాళ్లు మిత్రుడు అని పక్క రాష్ట్రం సీఎం జగన్ ను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకున్నాడు. ఆయన చెల్లెలు పార్టీ పెడితే ఇంటిగొడవలు అనుకున్నాడు. కానీ ఇప్పుడు నాగార్జునసాగర్ లో పక్కరాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పోటీచేయనుందన్న వార్త టీఆర్ఎస్ కు షాకింగ్ లా మారిందా? అంటే ఏమో అంటున్నారు. ఇదో రాజకీయ ఎత్తుగడ అనేవారు ఉన్నారు.

టీఆర్ఎస్ కు మిత్రుడు జగన్ పార్టీ కూడా నాగార్జున సాగర్ బరిలో దిగుతోందని తేలింది. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.

ఇన్నాళ్లు ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే త్రిముఖ పోరు అని భావించారు. కానీ ఇప్పుడు బహుముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది.

మాజీ మంత్రి జానారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఎన్నికల గోదాలోకి దిగేశారు. అధికార పార్టీ టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ శిబిరాల నుంచే ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు. ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎవరన్నది కసరత్తు చేస్తూనే ఉంది. టీఆర్ఎస్ వదిలేసిన క్యాండిడేట్ ను చేర్చుకొని టికెట్ ఇవ్వాలని బీజేపీ రెడీగా ఉంది. ఇక్కడ బీజేపీకి అభ్యర్తి లేకపోవడంతో టీఆర్ఎస్ రెబల్ పైనే ఆశలు పెంచుకుంది.

ఈ త్రిముఖ పోరు నడుస్తుండగా అనూహ్యంగా వైసీపీ నుంచి ఓ అభ్యర్థి నామినేషన్ వేయడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ఇప్పటివరకు సాగర్ ఉప ఎన్నికకు 13 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి తెలిపారు. అందులో 12 ఇండిపెండెంట్లు కాగా.. మరొకరు వైసీపీ అభ్యర్థి అని వెల్లడించారు.

తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా వైసీపీ పోటీచేయకుండా టీఆర్ఎస్ కు మద్దతుగా తెరవెనుక నిలుస్తోంది. జీహెచ్ఎంసీలోనూ అదే జరిగింది. సాగర్ ఎన్నికల్లో మాత్రం వైసీపీ పోటీచేస్తుండడం అధికార టీఆర్ఎస్ కు షాక్ లా మారింది.

అయితే వైసీపీ బరిలో ఉంటే ఓట్లు చీలిపోయి టీఆర్ఎస్ కే మేలు జరుగుతుందని.. టీఆర్ఎస్ మద్దతుతోనే వైసీపీ బరిలోకి దిగిందన్న వాదనను రాజకీయవిశ్లేషకులు చేస్తున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News