వెజ్ బిర్యానీ వండి పెడితే తినేందుకు వస్తా.. ఎన్నికల ప్రచారంలో ఆమె సంచలనం

Update: 2021-03-30 09:30 GMT
సినీ నటులకు సామాన్యుల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానానికి పరాకాష్ఠ ఎవరైనా ఉన్నారంటే.. ఆ జాబితాలో మొదటి స్థానం తమిళులదే. వారి అభిమానం కానీ ఆగ్రహం కానీ ఒక రేంజ్ లో ఉంటాయి. అభిమానిస్తే.. మరో  ఆలోచన లేకుండా గుడులు కట్టించేయటం తమిళనాడులోనే మొదలైంది. అలా గుళ్లు కట్టించుకున్న నటీమణుల్లో బొద్దుభామ నమిత ఒకరు. ఒకప్పుడు బొద్దుగా ఉంటూ తమిళుల మనసుల్ని దోచిన ఆమెకు వీరాభిమానులు ఎందుకో.

ఆ మధ్యన స్లిమ్ అయిన ఆమె తాజాగా జరుగుతున్న తమిళనాడు ఎన్నికల్లో ఒక బీజేపీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ముఖానికి మాస్కు పెట్టుకొని సామాన్యల చెంతకు వచ్చి.. తాను మద్దతు ఇస్తున్న బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేయాలని ఆమె కోరుతున్నారు. ఇటీవల కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా.. అభిమానుల్లో తనకున్న క్రేజ్ ను ఓట్లుగా మార్చేందుకు ఆమె కష్టపడుతున్నారు. మధురై పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శరవణన్ తరఫున ప్రచారం చేస్తున్నారు.

ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు.. ఉచిత కేబుల్ కనెక్షన్.. వాషింగ్ మిషన్ కావాలంటే అన్నాడీఎంకే మద్దతు ఇస్తున్న బీజేపీ అభ్యర్థులకు.. అన్నాడీఎంకే అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరుతున్నారు. ఉచిత సిలిండర్లు పొందితే ఇష్టం వచ్చినప్పుడు తమకు నచ్చిన బిర్యానీ చేసుకొని తినొచ్చంటూ ఊరిస్తున్నారు. తాను వెజిటేరియన్ ను అని.. వెజ్ బిర్యానీ వండి పెడితే తినటానికి వస్తానంటూ ఓటర్లను తన మాటలతో ఆకర్షిస్తున్నారు. ఆమె మాటలకు యూత్ నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. ప్రచారంలో మెరుస్తున్న నమిత.. బీజేపీ అభ్యర్థి విజయంలో ఏ మేరకు ప్రభావం చూపిస్తారన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News