పిచ్చ పీక్స్: దేవాన్ష్ పేరుతో కాల‌నీ!

Update: 2019-01-28 08:09 GMT
అభిమానం ఉండాలి. కానీ.. హ‌ద్దులు దాట‌కూడ‌దు. ప్రేమ ఉండాలి. కానీ.. అది పైశాచికంగా ఉండ‌కూడ‌దు. ఎవ‌రినైనా అభిమానించ‌టం.. ఆరాధించ‌టం ఎవ‌రైనా చేసే ప‌ని. కానీ.. అందులో ఓవరాక్ష‌న్ అస్స‌లు ఉండ‌కూడ‌దు. కానీ.. ఈ విష‌యాన్ని తెలుగు త‌మ్ముళ్లు అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేదు.

న‌వ్విపోదురుకాక నాకేంటి అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారే త‌ప్పించి.. అరే.. ఇలా చేస్తే న‌లుగురు ఏమ‌నుకుంటారు? అధినేత‌కు ఎంత చెడ్డ‌పేరు అన్న అవ‌గాహ‌న లేకుండా చేస్తున్న తీరు ఇప్పుడు టీడీపీ వ‌ర్గాల‌కు ఇబ్బందిక‌రంగా మారింద‌ని చెప్పాలి. ఇంత‌కూ విష‌యం ఏమంటే.. ప్ర‌భుత్వ సొమ్ముతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ ప‌థ‌కం కింద కాల‌నీని నిర్వ‌హించారు. దీనికి చంద్ర‌బాబు మ‌న‌మ‌డు దేవాన్ష్ పేరు పెట్ట‌టం సంచ‌ల‌నంగా మారింది.

రూల్స్ కు భిన్న‌మైనా.. ఇలా పేరు పెట్ట‌టాన్ని అధికారులు ఎవ‌రూ  ప్ర‌శ్నించే సాహ‌సం చేయ‌టం లేదు. సొమ్ము ప్ర‌జ‌ల‌దైతే.. పేరు చంద్ర‌బాబు మ‌న‌మ‌డిది ఎందుకంటూ ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఇంత‌కీ.. కాల‌నీకి బాబు మ‌న‌మ‌డి పేరు పెట్టిన గొప్ప ఊరు ఎక్క‌డ ఉందంటే.. కృష్ణా జిల్లా పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గంలోని కొమ‌ర‌వోలుగా చెప్పాలి.

ఈ గ్రామాన్ని బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి ద‌త్త‌త తీసుకున్నారు. ఈ గ్రామంలో సుమారు 2200 మంది ఉంటార‌ని చెబుతుంటారు. ఎన్టీఆర్ స‌తీమ‌ణి స్వ‌ర్గీయ బ‌స‌వ‌తార‌కం ఈ ఊళ్లోనే జ‌న్మించారు. ఈ కార‌ణంగా ఈ ఊరును ద‌త్త‌త తీసుకోవాల‌ని భువ‌నేశ్వ‌రి భావించారు. బాబు స‌తీమ‌ణి గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్న త‌ర్వాత ప్ర‌భుత్వ నిధుల‌తో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. అయిన‌ప్ప‌టికీ గ్రామంలో జ‌రిగిన అభివృద్ధి మొత్తం భువ‌నేశ్వ‌రి ఖాతాలో వేయ‌టంపై అక్క‌డి గ్రామ‌స్తులు విస్తుపోతున్నారు.

ఇదిలా ఉంటే.. అభిమానానికి పరాకాష్ఠ‌గా ఇదే గ్రామంలో నిర్మించిన ఎన్టీఆర్ గృహ‌నిర్మాణ ప‌థ‌కం కింద 250 ప‌క్కా గృహాల్ని నిర్మించారు.ఈ గృహ స‌ముదాయానికి చంద్ర‌బాబు మ‌న‌మ‌డు నారా దేవాన్ష్ పేరు పెట్ట‌టం ప‌లువురు దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఎక్క‌డైనా.. ఏదైనా అభివృద్ధిని ఎవ‌రైనా దాత‌లు త‌మ సొంత డ‌బ్బును విరాళంగా ఇవ్వ‌టం ద్వారా పేరు పెడుతుంటారు. అందుకు భిన్నంగా.. చిన్న‌పిల్లాడైన దేవాన్ష్ పేరును పెట్టాల‌న్న తెలుగు త‌మ్ముళ్ల నిర్ణ‌యం ప‌లువురి విమ‌ర్శ‌ల‌కు కార‌ణంగా మారుతోంది. తెలుగు త‌మ్ముళ్లు ప్ర‌ద‌ర్శించే ఇలాంటి అభిమానంతో బాబుకు మేలు కంటే కూడా కీడే ఎక్కువ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. అధికారం త‌ల‌కెక్కిన తెలుగు త‌మ్ముళ్ల‌కు ఇలాంటి స‌ల‌హాలు వినిపిస్తాయా?
Tags:    

Similar News