బాబును అవ‌మానించ‌లేద‌న్న లోకేశ్‌

Update: 2017-12-08 08:43 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును కేంద్రంలోని మోడీ స‌ర్కారు అవ‌మానించిందంటూ  ఇటీవ‌ల కాలంలో ప‌లువురి నోట వినిపిస్తున్న వాద‌న‌నుఆయ‌న కుమారుడు.. ఏపీ మంత్రి లోకేశ్ కొట్టిపారేశారు. బాబును కేంద్రం అవ‌మానించ‌లేద‌న్నారు. న‌వంబ‌రు 28న జ‌రిగిన జీఈఎస్ స‌ద‌స్సుకు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కేంద్రం ఆహ్వానించ‌క‌పోవ‌టంపై ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఇదే అంశాన్ని మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా స్పందించిన లోకేశ్‌.. ఈ స‌ద‌స్సును నీతిఅయోగ్ అధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌ లో నిర్వ‌హించార‌న్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వం చంద్ర‌బాబును ఆహ్వానించారా? అని కొంద‌రు అడుగుతున్నార‌ని.. కానీ.. ఈ స‌ద‌స్సు కేంద్రం నేతృత్వంలో జ‌రుగుతుంద‌ని.. ఎక్క‌డ కార్య‌క్ర‌మం జ‌రుగుతుందో ఆ ప్రాంత సీఎంను పిలుస్తార‌ని చెప్పారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును మాత్ర‌మే కాదు.. మిగిలిన రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను కూడా ఆహ్వానించ‌లేద‌న్న మాట‌ను చెప్పారు.

జీఈఎస్ స‌ద‌స్సు సంద‌ర్భంగా చంద్ర‌బాబును ఆహ్వానించ‌క‌పోవ‌టం త‌ప్పేం కాద‌ని చెప్పిన లోకేశ్‌ కు.. కొంద‌రు లేవ‌నెత్తిన లాజిక్ మీద కూడా లోకేశ్ మాట్లాడితే బాగుంటుంది. ఇంత‌కీ ఆ లాజిక్ ఏమిటంటే.. జీఈఎస్ స‌ద‌స్సు జ‌రిగిన హైద‌రాబాద్ న‌గ‌రం తెలంగాణ రాష్ట్రానికి మాత్ర‌మే కాదు ఏపీకి కూడా ఉమ్మ‌డి రాజ‌ధాని అన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. అలాంట‌ప్పుడు  ఉమ్మ‌డి రాజ‌ధానిలో జ‌రిగే అంత‌ర్జాతీయ స‌ద‌స్సుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రినే పిలుస్తారా? ఏపీ ముఖ్య‌మంత్రిని పిల‌వ‌రా? అన్న‌ది ప్ర‌శ్న‌. నిజ‌మే.. లాజిక్ వ‌ర‌కూ బాగానే ఉంది. మ‌రి.. దీనికి లోకేశ్ ఏం బ‌దులిస్తారో చూడాలి. 
Tags:    

Similar News