తెగిన విద్యుత్ లైన్ల తీగ లాగితే.. తాడేపల్లి ప్యాలేస్ డొంక కదులుతోందన్న లోకేశ్

Update: 2022-11-03 04:26 GMT
అనంతపురం జిల్లాలో పెను విషాదం చోటు చేసుకోవటం తెలిసిందే. జిల్లాలోని బొమ్మనహాల్ మండలం పరిధిలో ట్రాక్టర్ పై విద్యుత్ తీగలు తెగి పడిన ఉదంతంలో నలుగురు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మరణించటం తెలిసిందే. ఈ ఉదంతంలో పలువురు తీవ్రంగా గాయపడటం తెలిసిందే. ఈ ప్రమాదంపై జగన్ సర్కారు ఆవేదన వ్యక్తం చేస్తూ.. రూ.10లక్షల పరిహారాన్ని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల కాలంలో విద్యుత్ తీగలు వరుస పెట్టి ఎందుకు తెగుతున్నాయి? అంటూ నారా లోకేశ్ సూటి ప్రశ్నను జగన్ సర్కారుకు సంధించారు. అసలు ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఎవరు? వారికి కాంట్రాక్టులు ఇప్పించిన ప్రభుత్వ పెద్దలు ఎవరు? అంటూ ప్రశ్నించిన లోకేశ్.. తీగ లాగితే తాడేపల్లి ప్యాలేస్ డొంక కదులుతుందన్నారు. విద్యుత్ తీగలు తెగి..

ట్రాక్టర్ మీద పడటం.. నలుగురు కూలీలు ప్రాణాలు విడిచిన వైనంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ ఉదంతానికి నాలుగు రోజుల క్రితమే ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోని చియ్యపాడులో సాగు మోటారుకు విద్యుత్ సరఫరా చేసే తీగలు తెగిని ఉదంతంలో.. ముగ్గురు రైతులు మరణించటం తెలిసిందే.

ఇలా తరచూ విద్యుత్ తీగలు తెగి పడటం కారణంగా  ప్రాణాలు కోల్పోయిన వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన ప్రతిసారీ ఉడత కథ చెప్పి తప్పించుకోవటం.. ప్రమాదాన్నిదేవుడి ఖాతాలో వేసి చేతులు దులుపుకోవటం జగన్ సర్కారుకు అలవాటైందని మండిపడ్డారు. లోకేశ్ వ్యాఖ్యలు సంచలనంగానూ.. షాకింగ్ గానూ మారాయి. మరి.. లోకేశ్ చేసిన ఆరోపణలపై జగన్ సర్కారు ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News