లోకేష్ స్పెష‌ల్ టీంలో 40 మంది ఎమ్మెల్యేలు

Update: 2017-04-27 13:33 GMT
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, యువ మంత్రి నారా లోకేష్ రాజ‌కీయంగా తన దూకుడును పెంచేందుకు వేగంగా సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు  క‌నిపిస్తోంది. పార్టీకి చెందిన కొంద‌రు ఎమ్మెల్యేల‌ను ప్ర‌త్యేకంగా ఎంపిక చేసుకొని స‌మావేశం అవ‌డం ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. తాజాగా అమ‌రావ‌తి సచివాలయంలోని తన ఛాంబర్ లో మంత్రి లోకేశ్ 40 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ ప్రగతి, పురోగతిపై ఆ రంగంలో అనుభవం-అభిరుచి ఉన్న 40 మంది ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పంచాయతీలలో మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలపై వారితో చర్చించారని వెల్ల‌డించాయి.

అయితే, తెలుగుదేశం పార్టీ ప‌రిణామాల‌ను లోతుగా గ‌మ‌నిస్తున్న‌వారు లోకేష్ మీటింగ్ వెనుక లెక్క‌లు వేరే అని అంటున్నారు. ప్ర‌భుత్వంలో ప‌ట్టు సాధించేందుకు లోకేష్ వేసిన ముంద‌డుగులో ఇదో భాగ‌మ‌ని చెప్తున్నారు. భావ‌సారుప్య‌త క‌లిగిన వారు, పార్టీకోసం చిత్త‌శుద్ధితో ప‌నిచేసే నేత‌లు, సీనియ‌ర్ల‌తో కూడిన 40 మంది ఎమ్మెల్యేల‌ను ఎన్నికొని లోకేష్ స్పెష‌ల్ టీంను సిద్ధం చేసుకున్నార‌ని చెప్తున్నారు. వీరి ద్వారా క్షేత్ర‌స్థాయిలో తెలుగుదేశం పార్టీ బ‌లాబ‌లాలు, పార్టీని మ‌రింత‌గా చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు త‌దిత‌రాల‌పై వ్యూహాలు ర‌చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే పార్టీపై ప‌ట్టు సంపాదించిన లోకేష్ ప్ర‌భుత్వంలో సైతం త‌న ముద్ర‌ను వేసుకునే క్ర‌మంలోనే ఈ స‌మావేశం అని ప‌లువురు చెప్తున్నారు. పార్టీ నాయ‌కుడిగా ముందుగా సంస్థాగ‌త అంశాల‌పై శ్ర‌ద్ధ తీసుకున్న అనంత‌ర‌మే ఆయ‌న్ను ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వికి ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాతే పార్టీపై ఒకింత పట్టు వచ్చాక మంత్రిగా చేశారు. ఇప్పుడు నారా లోకేష్ పార్టీ, ప్రభుత్వాలపై పట్టు సాధించే క్రమంలో భాగంగా ఎమ్మెల్యేలతో భేటీ అవ‌డం మ‌రిన్ని `ముఖ్య‌`ప‌ద‌వులకు స‌న్న‌ద్ధం అవ‌డంలో భాగ‌మ‌ని విశ్లేషిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News