కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త పోస్టుతో పార్టీలోకి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ పార్టీలోకి మరింతగా చొచ్చుకుపోతున్నారు. ఇప్పటికే పార్టీ నేతల శుభాకాంక్షలు, వారికి అండగా నిలవాల్సిన సందర్భాల్లో క్షేత్రస్థాయికి వెళుతున్న లోకేష్ ఆ చొరవలో మరింత వేగం పెంచుతున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రకు 'కార్యకర్తల సంక్షేమ యాత్ర' అనే పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ యాత్రను ఈ నెల 14 నుంచి చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటగా ఈ యాత్రను చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభిస్తారని తెలుస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా గర్జన యాత్రను తిరుపతి నుంచి ప్రారంభించారు. లోకేష్ కూడా అక్కడి నుంచే యాత్ర ప్రారంభించాలని అనుకున్నారు. అయితే కొందరు పార్టీ ముఖ్యులు పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ ఎన్టీఆర్ గెలుపొందిన నియోజకవర్గమైన హిందూపురం నుంచి ప్రారంభించమని సలహా ఇస్తున్నారు. లోకేష్ సతీమణి బ్రాహ్మణి తండ్రి నందమూరి బాలకృష్ణ హిందుపురం ప్రస్తుత ఎమ్మెల్యే అన్న విషయం తెలిసిందే.
పార్టీలో పట్టు పెంచుకునేందుకు, కార్యకర్తలకు చేరువ అయ్యేందుకు లోకేష్ భలే రూట్‌ను ఎంచుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.